తమిళ హీరోలన్నా, డబ్బింగ్ సినిమాలు అన్నా మన ఆడియన్స్ కు కూడా భలే క్రేజ్. అందుకే తమిళ హీరోలకు కూడా తెలుగునాట విపరీతంగా అభిమానులు వున్నారు. తమిళ హీరోలు నేరుగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. అయితే రాను రాను తమిళ సినిమాల మీద అంచనాలు పెరిగిపోయి, రేట్లు ఆకాశానికి ఎత్తేసారు. దాంతో తమిళ భారీ సినిమాలు కొన్న మన బయ్యర్లంతా గుల్లయిపోయారు తప్ప, డబ్బులు చేసుకోలేదు. ముఖ్యంగా తమిళ్ టాప్ హీరోలు రజనీ, కమల్, సూర్య, కార్తీ ఇలా వీళ్ల సినిమాలు ఏవీ ఇప్పుడు లాభాలు ఇవ్వడంలేదు. దీంతో తమిళ భారీ సినిమాలు కొనేవారు కరువయ్యారు.
వచ్చేవారం విడుదలవుతోంది కమల్ హాసన్ విశ్వరూపం-2. ఈ సినిమా విడుదల డేట్ ఇచ్చేసినా, తెలుగు వెర్షన్ ఎవ్వరూ తీసుకుంటున్న దాఖలాలేదు. కమల్ తన స్వంత బ్యానర్ పైనే ఇక్కడ విడుదల చేసుకునే సన్నాహాల్లో వున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల సినిమా విడుదల వారం దూరంలో వున్నా, హడావుడి ఇంకా స్టార్ట్ కాలేదు. లోకల్ బయ్యర్ ఎవ్వరూ లేకుండానే విశ్వరూపం అడియో రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగిపోతోంది. ఆఖరికి ఎన్వీ ప్రసాద్ ను పంపిణీ వ్యవహారాలు చూడమని అప్పగించేసారు.
ఇక మరో రెండు మూడునెల్లలో రాబోయే రజనీ రోబో-2ను కూడా కోనేవారు కనిపించడం లేదు. ముందుగా 78 కోట్లకు బేరం సెటిల్ చేసుకుని 20 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చిన ఆసియన్ సునీల్ కు పదికోట్ల వెనక్కు ఇచ్చేసారు. మిగిలిన బకాయికి ఆగస్టు 10 గడుపు తేదీగా పెట్టారు. మరి ఆ తరువాత ఆ సినిమాను ఎవరికి ఇస్తారు అన్నది క్లారిటీలేదు. కొనేవాళ్లు అయితే లేరు. దిల్ రాజు కొనే సమస్యలేదని చెప్పేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా లైకా సంస్థ ఎన్వీ ప్రసాద్ ద్వారా పంపిణీకి సిద్దం చేసుకోవాల్సిందే. ఆ మధ్య కణం, కాలా సినిమాలు ఆయనే చేసారు. అందువల్ల రోబో కూడా ఆయనే చేయాలి. అయితే కొనడం అంటే దూరం అని పంపిణీ అయితే ఓకె అని అంటున్నట్లు వినికిడి..
మొత్తంమీద ఒకప్పుడు హాట్ కేక్ ల్లాంటి డబ్బింగ్ సినిమాలు ఇప్పుడు కొనేవాళ్లు కరువయ్యారు. పంపిణీగే ముందుకు వస్తున్నారు.