పెను తుపాను వచ్చినపుడు తప్పుకోవడం విజ్ఞుల లక్షణం అంటారు పెద్దలు. ఇండియన్ సినిమా మీద హాలీవుడ్ తుపానులా అవెంజర్స్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ టికెట్ లు అమ్ముడుపోయాయి. ఇన్ని షోలు, ఇన్ని స్క్రీన్ లు ఇస్తేనే సినిమా ఇస్తామని ముందుగానే మల్టీ ఫ్లెక్స్ లకు కండిషన్లు పెట్టిన సినిమా ఇది. దాని మాటకు తలొగ్గి, స్క్రీన్లు, షోలు ఇచ్చేసారు. ఇలాంటి టైమ్ లో విడుదల కావడం అంటే కాస్త కష్టమే.
అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ – తేజ కాంబినేషన్ సినిమా తేజ మొహమాటం లేకుండా వాయిదా పడిపోయిది. మరే సినిమా కూడా వచ్చే ధైర్యం చేయడంలేదు కూడా. ఆ సినిమాకు దాదాపు రెండువారాల అవతలనే సూపర్ స్టార్ మహేష్ మహర్షి వస్తోంది.
అర్జున్ ఏం చేస్తాడు?
ఇదిలావుంటే అవెంజర్స్ వచ్చిన అయిదు రోజులకు నిఖిల్ అర్జున్ సురవరం డేట్ ఫిక్స్ అయివుంది. ఈ డేట్ ఫిక్స్ చేసుకునే నాటికి అవెంజర్స్ వ్యవహారం ఇంత పీక్స్ లో లేదు. మరి ఇప్పుడు కింకర్తవ్యం అన్నది పాయింట్.
అవెంజర్స్ వచ్చిన అయిదు రోజులకు అంటే ఒక్క మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ కూడా దొరికే సమస్యే లేదు. ఇక కేవలం సింగిల్స్ స్క్రీన్ల మీద ఆధారపడాలి. లేదూ, ఫస్ట్ తేదీకి బదులు మూడవతేదీ శుక్రవారానికి వస్తే, మళ్లీ వారం తిరగకుండా మహర్షి వచ్చి థియేటర్లలోంచి లేపేస్తుంది.
పోనీ వెనక్కు వెళ్దామన్నా డేట్ లు లేవు. మహర్షి తరువాత వారం ఏబిసిడి, ఆ పైన సీత ఇలా చాలా వున్నాయి. మొత్తానికి అవెంజర్స్ వచ్చి రెండు, మూడు డేట్ లు గాయబ్ చేసేసినట్లే.