బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ మీద కన్నేశారు. మొన్నామధ్య కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైద్రాబాద్‌కి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్, ‘నాగార్జునతో నటించాలని వుంది..’ అంటూ నాగార్జునపై అభిమానాన్ని చాటుకున్న విషయం విదితమే. మరో బాలీవుడ్ క్యూటీ అలియాభట్, తెలుగులో సినిమా అంటూ చేస్తే జూనియర్ ఎన్టీఆర్‌తోనేనని స్పష్టం చేసింది.
కాజల్, తమన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ నుంచి చాలామంది భామలు టాలీవుడ్‌కి వచ్చారు. కొందరు బాలీవుడ్‌లోనే తొలుత తెరంగేట్రం చేసినా, అక్కడ వారికి గుర్తింపు రాక, సౌత్ సినిమాల్లో నటించి, ఇక్కడ స్టార్స్‌గా ఎదిగి బాలీవుడ్‌కి వెళ్ళి అక్కడ తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకున్న సందర్భాలనేకం. ప్రియాంకా చోప్రా కూడా ‘తుఫాన్’ (హిందీలో జంజీర్)కన్నా ముందే ఓ తెలుగు సినిమాలో నటించింది. కత్రినాకైఫ్ సంగతి సరే సరి. ఐశ్వర్యారాయ్ కూడా నాగార్జునతో ఓ సినిమాలో నర్తించింది.
మొత్తమ్మీద, బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాల్ని హిందీలోకి రీమేక్ చేసుకుంటోంటే.. బాలీవుడ్ హీరోయిన్లు, తెలుగు హీరోలపై మనసు పారేసుకుంటున్నారన్నమాట. ఇదంతా తమ తమ సినిమాల పబ్లిసిటీ కోసమేనా.. లేదంటే నిజంగానే తెలుగు సినిమాల్లో నటించాలని వారికి ఆసక్తి వుందా.? ఏమో మరి.. కాలమే సమాధానం చెప్పాలి.