అవికగౌర్ గాయబ్?

సినిమా నటుల జీవితాలు చూసేవాళ్లకు అద్భుతంగా కనిపిస్తాయి.కానీ వాళ్ల సమస్యలు వాళ్లకీ వుంటాయి. అందులో హీరోయిన్ల జీవితాలైతే మరీనూ. సమస్యల వలయంలో చిక్కుకుని కూడా, చిరునవ్వులు చిందిస్తూ తెరముందు నటించే హీరోయిన్ల గురించి ఎన్నో…

సినిమా నటుల జీవితాలు చూసేవాళ్లకు అద్భుతంగా కనిపిస్తాయి.కానీ వాళ్ల సమస్యలు వాళ్లకీ వుంటాయి. అందులో హీరోయిన్ల జీవితాలైతే మరీనూ. సమస్యల వలయంలో చిక్కుకుని కూడా, చిరునవ్వులు చిందిస్తూ తెరముందు నటించే హీరోయిన్ల గురించి ఎన్నో కథలు వచ్చాయి..సినిమాలు వచ్చాయి.

దేశవ్యాప్తంగా పాపులర్ అయిన టీవీ, సినిమా స్టార్ అవిక గౌర్ జీవితం కూడా ఇంచుమించు ఇలాంటిదే అన్న వదంతులు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరమైనట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై వినిపిస్తున్న గుసగుసల సారాంశం ఇలా వుంది. 

అవికాగౌర్ చిన్నప్పటి నుంచి నటిస్తోంది. టీవీ సీరియళ్ల ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది. వృత్తి విషయంలో ఆమె చాలా డిసిప్లిన్డ్ గా వ్యవహరించేది. ఏనాడూ షూటింగ్ ఎగ్గొట్టడం కానీ, ఆలస్యంగా రావడం కానీ లేదు. తెలుగులో నటించడం ప్రారంభించిన తరువాత కూడా ముంబాయి నుంచి హైదరాబాద్ కు తిరుగుతూ, నానా హైరానా పడుతూ కూడా నటిస్తూనే వచ్చింది. జనాలు నమ్ముతారో నమ్మరో కానీ, ఉయ్యాల జంపాల సినిమాలో నటించేటప్పటికి ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. 1997లో పుట్టింది అవిక గౌర్. గుజరాతీ అయిన అవిక చిన్నప్పటి నుంచే మోడల్ గా, టీవీ నటిగా, అవిశ్రాంతంగా పని చేస్తూనే వచ్చింది. 

దాంతో ఆమెకు ఈ బిజీబిజీ బతుకుపై విరక్తి వచ్చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆమెకు అటు ముంబాయిలోనూ, ఇటు హైదరాబాద్ లోనూ చిన్న చిన్న చేదు అనుభవాలు తప్పలేదు. కొన్నాళ్ల క్రితం తను-నేను సినిమా చేస్తున్నపుడు అయితే, ఒక దశలో అప్పటికి సినిమాకు అయిన ఖర్చంతా ఇచ్చేస్తాను, సినిమాను ఆపేయండి..చేయను అని ఆమె నిర్మాతను రిక్వెస్ట్ చేసినట్లు వినికిడి. ఇంతలా అడగడానికి మరి ఆ సినిమాలో నటించిన ఒకరితో పొసగలేదనే గుసగుసలు వున్నాయి. 

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నదేమిటంటే, ఆమె అందరికీ దూరంగా ముంబాయిలో తను ఒక్కర్తే ప్రశాంతంగా వుంటోందని తెలుస్తోంది. ఇటీవల 18ఏళ్లు దాటి 19 రాగానే, మైనారిటీ తీరగానే తల్లితండ్రులకు కూడా దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ప్రశాంతంగా జీవించిన తరువాతే కెరీర్ పై మళ్లీ దృష్టి పెట్టడమా, ఏం చేయడమా? అన్నది డిసైడ్ చేసుకోవాలన్నది అవిక గౌర్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబాయిలోని ఒక ప్రాపర్టీని కూడా అవిక అమ్మేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

హీరోయిన్లను వాళ్ల తల్లి తండ్రులు మరీ యంత్రాల్లా చూసి, పని చేయిస్తే, ఇలాంటి సమస్యలే వస్తాయి. కెరీర్ ను ప్రశాంతగా సాగనిస్తే ఆ తీరే వేరు.