ఇప్పటికే మహేశ్ బాబు మీద చాలా మంది భారం మోపారు! తండ్రి కృష్ణ ఏవైనా సినిమాల్లో నటిస్తే.. వాటిని ప్రమోట్ చేయాలి. ఇక బావ సుధీర్ బాబు ఉండనే ఉన్నాడు. సుధీర్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపడానికి లేదు. సోదరి భర్త కదా! అసలు మహేశ్ ప్రమోషన్ కు ఓకే అంటేనే, సుధీర్ సినిమాలు పట్టాలెక్కుతాయి.
ఇక వీళ్లు కాకుండా.. నరేష్ తనయుడు వంటి దూరపు బంధువులు కూడా మహేశ్ మీదే ఆధారపడతారు. మంజుల ఏదైనా సినిమాలో నటిస్తే దాని తరపున కూడా మాట్లాడాలి, ట్వీట్లు పెట్టాలి! ఈ విధంగా ఇంతమంది ప్రిన్స్ మీద ఆధారపడ్డారు.
ఇక వీళ్లందరి సంగతలా ఉంటే.. మహేశ్ బాబు మీద మరో బాధ్యత దాదాపు పడ్డట్టే. ఈ సారి మేనల్లుడు. తనకు జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి, స్ఫూర్తి అయిన బావ గల్లా జయదేవ్ తనయుడు, సోదరి కుమారుడు హీరోగా రాబోతున్నాడు. ఇది వరకూ బాలనటుడిగా అతడు మహేశ్ సినిమా ‘నాని’లోనే కనిపించాడు. ఇప్పుడు ఫుల్ టైమ్ హీరోగా రాబోతున్నాడు.
ఇటు రాజకీయ వ్యాపార నేపథ్యం ఉన్న గల్లా ఫ్యామిలీకి వారసుడిగా వస్తున్నా, కృష్ణకు మనవడు.. అనే ట్యాగ్ తో వస్తున్నా.. అంతిమంగా అతడిని ప్రమోట్ చేసే బాధ్యత మాత్రం మహేశ్ మీదే పడుతుంది. ఆ కుర్రాడి సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి.. విడుదలయ్యాకా.. ప్రమోషన్ చేయడం వరకూ మహేశ్ మీదే భారం. ఏ మాత్రం వదిలించుకోవడానికి వీల్లేని బాధ్యతలు ఇవి.
సుధీర్ బాబు సినిమాను ఎంతలా ప్రమోట్ చేస్తూ వచ్చాడో.. మేనల్లుడి సినిమాలను అంతకు పది రెట్లు ఎక్కువ స్థాయిలో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఏతావాతా ప్రమోషన్ విషయంలో అరడజను మంది ఇంట్లో వాళ్లను మోయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు ప్రిన్స్. ఈ పోరాటం ప్రహసనం అయ్యే అవకాశాలున్నాయి సుమా! ఇంకా ముందు ముందు సొంత కుమారుడు కూడా ఉన్నాడు!