వైకాపాలో నాయకులేనా? సభ్యులు లేరా?

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో ఇది ప్రధానమైన పార్టీ. గత ఎన్నికల్లో అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయిన పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలుపు…

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో ఇది ప్రధానమైన పార్టీ. గత ఎన్నికల్లో అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయిన పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని, అధికారం గ్యారంటీ అని వంద శాతం నమ్మకంగా ఉన్న పార్టీ. అసలు వచ్చే ఎన్నికల వరకు ఆగనక్కర్లేదని, ఈలోగానే ఎన్నికలు జరుగుతాయని, జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని విశ్వాసంతో ఉన్న పార్టీ. నిజమే…జగన్మోహన్‌ రెడ్డి అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించేశారు. ఎన్నికల మాటలే మాట్లాడుతున్నారు. అప్పుడే ఇద్దరు అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించేశారు.

ఈమధ్య ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. ఇంకా కొంతమంది కోసం గాలం వేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి తన పార్టీకి సభ్యత్వ బలం చేకూర్చాలని ఎందుకు ఆలోచించడంలేదు? ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ప్రతి పార్టీ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ తప్పనిసరిగా చేస్తుంది. ఈ పని వందేళ్ల పార్టీకైనా, కొత్తగా పుట్టిన పార్టీకైనా తప్పదు.

కాని సభ్యత్వ నమోదుకు వైఎస్సార్‌సీపీ ఎందుకు తిలోదకాలు ఇచ్చిందనే ప్రశ్నకు జవాబు లేదు. ఇతర పార్టీల్లోని నాయకులను తన పార్టీలోకి లాగడానికి కృషి చేస్తున్న జగన్‌ సభ్యత్వ నమోదును ఎందుకు గాలికొదిలేశారు? పార్టీకి ఏర్పరచుకునే పునాదుల్లో సభ్యత్వ నమోదు ప్రధానమైంది. కాని 2014 ఎన్నికల తరువాత జగన్‌ పార్టీ ఇప్పటివరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదు. పార్టీ రాజ్యాంగంలో (బైలాస్‌) ప్రతి రెండేళ్లకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని రాసుకున్నారు. కాని పార్టీ తన రాజ్యాంగాన్ని తానే పట్టించుకోవడంలేదు. ఎన్నికలు ముగిసి మూడేళ్లవుతున్నా సభ్యత్వ నమోదు ఊసే లేదు.

రాజకీయ కుటుంబానికి చెందిన జగన్‌కు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ ముఖ్యమనే సంగతి తెలియకుండా ఉండదు. దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో బలమైన పునాదులు, కార్యకర్తల, సభ్యుల బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. 

కార్యకర్తల బలం దండిగా ఉన్న పార్టీ టీడీపీ అని ఎవరైనా ఒప్పుకుంటారు. కార్యకర్తలను కాపాడుకోవడానికి ఆ పార్టీ వారి కోసం సంక్షేమ కార్యక్రమాలు (బీమా పథకం, పాఠశాలలు వగైరా) అమలు చేస్తోంది. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న ఈ పార్టీకి ఇప్పటికీ కార్యకర్తల అండ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సభ్యత్వ నమోదును కూడా టీడీపీ సీరియస్‌గా తీసుకుంటోంది. గతంలో యాభై లక్షలు ఉన్న సభ్యత్వాన్ని ఈసారి కోటికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలు చేశామని చెప్పుకుంటోంది. టీడీపీలో పార్టీ నిర్వహణా తీరు, సంస్థాగత నిర్మాణం మొదలైనవి పకడ్బందీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ పని జగన్‌ పార్టీ ఎందుకు చేయడంలేదు? సభ్యత్వ నమోదు లేకపోయినా ఏమీ కాదనుకుంటోందా? అలాంటప్పుడు పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే సరి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారై చివరకు కాంగ్రెసులో కలిసిపోయింది. 

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం ఏమిటో ఇప్పటివరకు తెలియలేదు. కాని ఎన్నికల్లో పోటీకి సిద్ధమని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాడు. ఇక వైకాపాలో పార్టీ సంస్థాగత వ్యవహారాలన్నీ రాజ్యసభ ఎంపీ, జగన్‌ కుడిభుజమైన విజయసాయి రెడ్డి చూస్తున్నారు. 2017 జూన్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించినప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చెబుతున్నారు.

ఇప్పటివరకు సభ్యత్వ నమోదు చేయలేకపోయినమాట వాస్తవమేనని, ఇందుకు అనేక కారణాలున్నాయిని అంటున్నారు. ఆ కారణాలేమిటో తెలియదు. చంద్రబాబు నాయుడికి గట్టి పోటీదారును తానేనని అనుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డి పార్టీని కూడా పటిష్టంగా తయారుచేసుకుంటేనే ఫలితం ఉంటుంది.