ఏమాత్రం మొహమాటాల్లేవు.. 'అఖిల్' సినిమా ఫ్లాపయ్యిందని నాగార్జున స్వయంగా అంగీకరించేశాడు. ఆ సినిమా అభిమానుల్ని ఎంత నిరాశపర్చిందో నాగార్జునకి తెలుసు. అభిమానులకన్నా ఎక్కువగా నాగార్జునే హర్టయ్యాడు 'అఖిల్' సినిమా ఫ్లాపవడంతో. తన కుమారుడు అక్కినేని అఖిల్ తెరంగేట్రం అద్భుతంగా వుంటుందనుకున్న నాగార్జునకి, 'అఖిల్' పరాజయం పెద్ద షాకే ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు నాగార్జున.
హీరో నితిన్ అడగ్గానే, నిర్మాతగా అతనికి అవకాశమివ్వడం, వినాయక్‌తో మాస్ సినిమాకి అఖిల్‌ని సిద్ధం చేయడం.. ఇలా నాగార్జున చెయ్యాల్సినవన్నీ చేసినా, కథలో మేటర్ లేక 'అఖిల్' దారుణ పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతగా నితిన్‌ని నిండా ముంచేసిన సినిమా 'అఖిల్'. ఎలాగైతేనేం, అఖిల్ దెబ్బ నుంచి నాగార్జున తేరుకున్నాడు. తన కుమారుడ్ని 'రీ-లాంఛ్' చేయబోతున్నట్లు మొన్నామధ్యన ప్రకటించేశాడు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించనున్న సినిమా జనవరిలో లాంఛనంగా ప్రారంభమవుతుంది. జనవరి 4వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. అంతేనా, ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారట. 'అఖిల్' సినిమాని పూర్తిగా మర్చిపోయి, ఇదే అఖిల్‌కి తొలి సినిమా అనేంతలా ఆ ఈవెంట్‌ని నిర్వహించాలన్నది నాగ్ ఆలోచనగా కన్పిస్తోంది. ఏం చేసినా, తొలి సినిమా 'అఖిల్' అన్న విషయాన్ని అఖిల్ మర్చిపోలేడు, నాగార్జునా అంతే.. అభిమానులూ సేమ్ టు సేమ్.