వారి దాహం తీరాలంటే మనిషి రక్తమే కావాలి.. వారి ఆకలికి మనుషుల మాంసమే కావాలి. మనుషులు కాదు, నరరూప రాక్షసులు వాళ్ళు. మతం ముసుగులో మారణహోమం సృష్టించడం, దానికి 'పవిత్ర యుద్ధం' అనే దిక్కుమాలిన పేరు పెట్టడం.. ఆ నర రూప రాక్షసులకే చెల్లుతుంది. 'ఏ మతమూ హత్యా కాండని సహించదు..' అంటూ అన్ని మతాలూ ఘోషిస్తున్నాసరే, వారెంచుకున్న మతం పేరు మాత్రం మారదు.. అదే 'రాక్షసత్వం'.
2013 ఫిబ్రవరి 21.. ఎప్పుడూ బిజీగా వుండే ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో విలవిల్లాడారు. ఆ తర్వాత కాస్సేపటికిగానీ అర్థం కాలేదు అక్కడ పేలుడు సంభవించిందని. క్షతగాత్రుల్లో చాలామందికి తమ శరీర భాగాలు తెగిపడ్డాయని కూడా తెలియని దుస్థితి. అంత పెద్ద షాక్ ఆ ఘటన.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు, అక్కడున్నవారే బాధితుల్ని ఆదుకున్నారు.. హుటాహుటిన అక్కడినుంచి ఆసుపత్రులకు తరలించారు. అవసరమైనవారికి రక్తదానం చేశారు. అలా బాధితుల్ని ఆదుకున్నవారిలో మతాలకతీతంగా అందరూ వున్నారు. అదీ మానవత్వం అంటే. ఆ మానవత్వమే మనిషి మతం. కానీ, రాక్షసుల మతం వేరు. వారి జాతి వేరు. మనుషుల్ని పొట్టనపెట్టుకోవడమే వారికి తెలిసన మతం.. అదే రాక్షసత్వం.
19 మంది మృతి చెందిన ఈ ఘటనకు కీలక సూత్రధారి రియాజ్ భత్కల్. భారతదేశంలో మారణహోమం సృష్టించి, పాకిస్తాన్‌కి పారిపోయిన పిరికిపంద రియాజ్ భత్కల్. ఈ కేసులో మొత్తం ఐదుగురికి నేడు ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. కేసు విచారణ శరవేగంగా జరిగిందని చెప్పక తప్పదు. కోర్టుల్ని తప్పుదోవ పట్టించడానికి నరరూప రాక్షసులు వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. వారి ఎత్తుగడల్ని ఎన్‌ఐఏ చిత్తు చేసింది. వారి నేరాల్ని నిరూపించింది.
ఉరిశిక్ష పడ్డ ఐదుగురిలో నలుగురు మాత్రమే ఇప్పుడు దొరికారు.. రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లో వున్నాడు. న్యాయస్థానం ఉరిశిక్ష విధించిందన్న వార్తతో బాధితులకు ఊరట కలిగిందన్నది నిర్వివాదాంశం. న్యాయం జరిగిందనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ప్రాణాలు కోల్పోయిన తమవారి ఆత్మలు శాంతిస్తాయని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైనవారిది నేటికీ జీవన్మరణ సమస్యే.
ఒక్కటి మాత్రం నిజం. నరరూపరాక్షసులకి ఈ భూమ్మీద చోటు లేదు. దురదృష్టవశాత్తూ ఇలాంటి నరరూప రాక్షసుల్నీ సమర్థించే మేధాలువు మన దేశంలో కొందరున్నారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకి మరణ శిక్ష పడితే, దాన్ని సైతం మేధావులైన సోకాల్డ్ విద్యార్థులెంత రచ్చ చేశారో చూశాం కదా.! ఇప్పుడీ ఐదుగురు నరరూప రాక్షసుల్ని వెనకేసుకొచ్చేందుకు ఎవరు ముందుకొస్తారో మరి.!