కాదేదీ వ్యాపారానికి అనర్హం. సినిమా అవార్డుల ఫంక్షన్లు కూడా భారీ వ్యాపారంగా మారిపోయింది. స్టార్స్ కు సకల సదుపాయాలు కల్పించి, విమానాల టికెట్ లు తీసి, రూమ్ లు బుక్ చేసి అవార్డుల ఫంక్షన్ కు తీసుకెళ్తున్నారు. ఆ ఫంక్షన్ లైవ్ టెలికాస్డ్ హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్లను యథాశక్తి పట్టుకుని, వీలయినంత పోగేస్తున్నారు. దాంతో ఈ ఖర్చులు పోను భారీగానే గిట్టుబాటు అవుతోందని వినికిడి. ఎప్పుడైతే ఈ వ్యాపారం బాగానే వుందో. కొత్త కొత్త జనాలు ఇందులోకి వస్తున్నారు.
ఇలాంటి అవార్డుల ఫంక్షన్ కు మరిన్ని సొబగులు జోడించి, కార్పొరేట్ స్టయిల్ లో ఓ కొత్త సంస్థ కార్యక్రమం చేపట్టింది. గత ఏడాది నుంచి ఇండీవుడ్ అనే సంస్థ కూడా ఇలాంటి కార్యక్రమమే, కాస్త క్లాస్ గా ప్రారంభించింది. అయితే దేశ వ్యాప్తంగా, అవకాశం వుంటే విదేశీ జనాలకను కూడా రప్పించి హడావుడి చేస్తున్నారు. గత ఏడాది చేసింది అంతగా ఫోకస్ లోకి రాకపోవడంతో, ఇలా కాదు, ముందు మీడియానే మంచి చేసుకోవాలని, కనిపించిన వాడిని కనిపించినట్లు పిలిచేసి అవార్డులు అందించేసారు. అయినా పాపం, కవరేజ్ అంతంత మాత్రం అయిపోయింది.
ఇప్పుడు మళ్లీ రెండో సారి పంక్షన్ కు సన్నాహాలు మొదలెట్టారు. అయితే కేవలం అవార్డుల ఫంక్షన్ మాదిరిగా కాకుండా, ఓ ఫిల్మోత్సవ్ మాదిరిగా ప్లాన్ చేస్తున్నారట. అంటే సినిమాల ప్రదర్శనులు, ఆపై అవార్డులు కూడా వుంటాయన్నమాట. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ చాలా భారీగా వుంది. అసలు ఇండీవుడ్ ప్లాట్ ఫారమ్ కారణంగానే వెయ్యి కోట్ల మహాభారతం ప్రాజెక్టు తెరపైకి వచ్చిందన్నంతగా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్లను ఫోగేసి, ఓ సినిమా కన్సార్టియమ్ తయారుచేస్తారట. అలా తయారు చేసి, వచ్చే అయిదేళ్లలో వెయ్యి సినిమాలు అందిస్తారట.
ఇదంతా గాలిలో మేడలు అన్నట్లుగా వుంది తప్ప వేరుకాదన్నట్లు కనిపిస్తోంది.. బాహబలి ప్రాజెక్టు చూసి, అన్ని సినిమాలూ వందల కోట్లు కలెక్ట్ చేసేస్తాయని కార్పొరేట్లో? బిలియనీర్ పెట్టుబడిదారులో భ్రమపడితే, ఇండియా సినిమా ఇండస్ట్రీని తక్కువ అంచనావేసినట్లే. ఇక్కడ మహా మహా ముదుర్లు వుంటారు. వందల కోట్లు పట్టకుని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది కనుమరుగైపోయారు.
మరి ఈ హడావుడి, కన్సార్టియ అంటూ రంగుల కలలు చూపిస్తుంటే వచ్చే పెట్టుబడి దారులు ఏమేరకు సాధిస్తారో చూడాలి.