బాహుబలి 2 జూదం విలువ 600 కోట్లు

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడంలో టాలీవుడ్ ను మించిన రంగం లేదు. నిన్నటి మూతుల నేతుల వాసనలు చూపించి, ఇప్పటి సరుకు అంటగట్టేస్తారు. అదృష్టం బాగుంటే సూపర్ లేదంటే, కొనుక్కున్న వాళ్లు పాపర్.…

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడంలో టాలీవుడ్ ను మించిన రంగం లేదు. నిన్నటి మూతుల నేతుల వాసనలు చూపించి, ఇప్పటి సరుకు అంటగట్టేస్తారు. అదృష్టం బాగుంటే సూపర్ లేదంటే, కొనుక్కున్న వాళ్లు పాపర్. కోట్ల జూదం ఈ రంగంలో అలా సాగిపోతూనే వుంటుంది. ఇప్పుడు బాహుబలి 2 వ్యవహారం అలాగే వుంది. 

బాహుబలి పార్ట్ వన్ నిర్మాతలకు చుక్కలు చూపించింది. సుమారు ముఫై కోట్ల డెఫిసిట్ తో విడుదల చేసారు. నిర్మాతల కష్టాన్ని, రాజమౌళి టాలెంట్ ను బయ్యర్లు లాభాలుగా మార్చుకున్నారు. సో ఇప్పుడు అంతకు అంతా లాభాలు చేసుకోవాలని బాహుబలి నిర్మాతలు డిసైడ్ అయిపోయారు. బాహుబలి 2 హక్కుల కోసం వస్తున్న పోటీ వారికి వరంగా మారింది. దాంతో రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. కొనేవాళ్లు ఏం జరుగుతుందో అన్నది ఆలోచించకుండా కొంటున్నారు.

బాహుబలి పార్ట్ వన్ కలెక్షన్లు ఓ అద్భుతం. టాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్లు అంటేనే చాలా కష్టం. ప్రతి ఇంటి నుంచి జనాలు బయటకు వస్తే, గడచిన పదేళ్లుగా సినిమాలు చూడని వారు కూడా థియేటర్లకు వస్తే,ఈ కలెక్షన్లు సాధ్యం అయ్యాయి. ఇప్పుడు ఈ షేర్ కు మరి కాస్త కలిపి రేటుగా ఫిక్స్ చేస్తున్నారు. 

అంటే బాహుబలి వన్ చూసిన వారంతా మళ్లీ పార్ట్ టూ చూడాలి. అలా అయితేనే పెట్టుబడి రిటర్న్ వస్తుంది. అది కాకుండా ఇంకా మరింత మంది చూస్తేనే ఖర్చులు ఆ పై లాభాలు కళ్ల చూస్తారు. కానీ పార్ట్ వన్ కు వచ్చిన హైప్ వేరు, ప్రచారం వేరు. పార్ట్ వన్ కు ఆ హైప్, ప్రచారం వల్ల కలెక్షన్లు అయితే వచ్చాయి కానీ, చూసిన వారిలో నూరు శాతం మంది సంతృప్తి చెందలేదన్నది నికార్సయిన నిజం. 

కనీసం పది నుంచి ఇరవై శాతం మంది అయినా ఏముంది ఇందులో అని పెదవి విరిచారు. మరి ఈ పది ఇరవై శాతం మంది ఈ సారి రెండో పార్ట్ కు థియేటర్ కు వస్తారా అన్నది అనుమానం. అదే జరిగితే కనుకు ఈసారి బాహుబలి బయ్యర్లు దారుణంగా దెబ్బతింటారు. నిర్మాతలు మాత్రం భయంకరంగా లాభాలు చేసుకుంటారు. నిర్మాతల టార్గెట్ 600 కోట్లు. 

బాహుబలి 2 జూదం ఏ రేంజ్ లో వుందీ అంటే ఒక్క సీడెడ్ హక్కులే ఇరవై కోట్లకు పైగా చెబుతున్నారు. కృష్ణా జిల్లా హక్కులు ఆరు కోట్లకు పైగా విక్రయించారు. ఓవర్ సీస్ మొత్తం ఓ తమిళ కంపెనీ వెల్లడించని భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. మొత్తానికి బాహుబలి ఫలాలు పార్ట్ టు టైమ్ లో నిర్మాతలకు దక్కుతున్నాయి. పార్ట్ వన్ కొన్న కొంత మంది బయ్యర్లు ఇప్పుడు పార్ట్ 2 కి దూరంగా వున్నారు. ఫస్ట్ పార్ట్ కలెక్షన్లు చూసి కొత్త వాళ్లు రంగంలోకి దిగుతున్నారు. మరి వీళ్ల అంచనాలు ఏమవుతాయో చూడాలి.