బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా అచ్చంగా బాహుబలి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా సింగిల్ పార్ట్ గా ప్రారంభమైంది. కానీ కొంత తీసాక అప్పుడు రెండు భాగాలుగా మారింది.
బాహుబలి కూడా సేమ్ టు సేమ్. బాహుబలి కూడా ఒక పార్ట్ కు ఎక్కువ..రెండు పార్ట్ లకు తక్కువ అన్నపుడు కాస్త టైమ్ తీసుకుని అదనపు కథను అల్లుకున్నారు. ఇక్కడ కూడా అంతే.
అయితే బాహుబలి మధ్యలో రెండు భాగాలు చేయడం వల్ల తరువాత తీయాల్సిన సీన్లు ముందు, ముందు తీయాల్సిన సీన్లు తరువాత తీయాల్సి వచ్చింది. అందువల్ల ఫస్ట్ పార్ట్ పూర్తయేసరికి రెండో భాగానికి సంబంధించి చాలా ఫుటేజ్ రెడీగా వుంది.
ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అంతే. ఇదే సమయంలో ఇలా జరగడం వల్ల ఫస్ట్ పార్ట్ విడుదల నాటికి బడ్జెట్ డెఫిసిట్ అన్నది బాహుబలికి తప్పలేదు. కొంత డెఫిసిట్ దానికి మించిన పుటేజ్ వుండడం అన్నది జరిగిన సంగతి.
ఇప్పుడు పుష్ప కూడా డిటో డిటో అని వినిపిస్తోంది. సినిమా విడుదల నాటికి కనీసం ఇరవై కోట్లు అయినా రెండో భాగం పెట్టుబడి డెఫిసిట్ గా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. అందుకే రెండు భాగాలు ఓ దాని వెంట మరొకటి విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. అలా అయితే వడ్డీలు భారీగా సేవ్ అవుతాయి.
అలా కాకుండా మధ్యలో వేరే సినిమా విడుదల చేసి, అప్పుడు రెండో భాగం అంటే కనీసం ఆరునెలలు వడ్డీలు కట్టుకోవాలి. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం బాహుబలి అడుగుజాడ పుష్పకు సెట్ కావడం లేదు.
రెండు భాగాలకు మధ్యలో గ్యాప్ తప్పకపోవచ్చు. మొత్తానికి చూస్తుంటే పుష్ప కూడా బాహుబలి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.