బాలకృష్ణ ఒక్కసారి కథ ఓకే చేస్తే ఇక ఆ దర్శకుడు ఏమి తీసినా కానీ అడ్డు చెప్పకుండా చేసేస్తారనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. సాధారణంగా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చే బాలయ్య తన తండ్రి జీవిత కథతో తీస్తోన్న 'ఎన్టీఆర్' విషయంలో మాత్రం అన్నీ తానే చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించడానికి వేరే వాళ్లున్నా కానీ నిర్మాతలతో తాను ఒకడయ్యారు.
అంతే కాకుండా తేజ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం నుంచి తేజ తప్పుకోవడానికి కూడా బాలయ్య కారణమయ్యారని చెప్పుకున్నారు. తేజకి ఫ్రీడమ్ ఇవ్వకుండా, తాను ఎలాగైతే సినిమా వుండాలని భావిస్తున్నారో అలాగే ఈ చిత్రం వుండాలని, ఎవరి విజన్ వద్దన్నట్టు వ్యవహరించడం వల్ల అతను తప్పుకున్నాడట. ఈ చిత్రాన్ని ఎవరి చేతుల్లో అయినా పెట్టాలా లేక తానే డైరెక్ట్ చేయాలా అని కూడా బాలయ్య ఆలోచించారు.
ఇంతలో ఆయనకి 'గౌతమిపుత్ర శాతకర్ణి' తీసిన క్రిష్ దొరకడంతో అతనికి బాధ్యతలు అప్పగించారు. క్రిష్ అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్. తన సినిమాలని తానే నిర్మించుకుంటాడు. పూర్తి స్వేఛ్ఛ కోరుకునే క్రిష్‌కి ఇప్పుడు బాలయ్య కంట్రోల్‌లో వున్న 'ఎన్టీఆర్'ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోగలడా? బాలయ్య మాత్రం అతని మీదే ఈ చిత్రాన్ని వదిలేసి చెప్పింది చేస్తాడంటారా?