సినిమా బిజినెస్ అనేది కేవలం హీరో మీదే ఆధారపడదు. కాంబినేషన్ కీలకం. భరత్ అనే నేను సినిమాకు అలాంటి కాంబినేషన్ నే సెట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు వున్న కొరటాల శివ డైరక్టర్. మహేష్ బాబు హీరో. దాంతో ఆ సినిమాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. భరత్ అనే నేను సినిమా హిందీ ఆల్ రైట్స్ అమ్మేసారు. సుమారు 13కోట్లకు ఈ హక్కులను విక్రయించినట్లు తెలుస్తోంది.
హిందీ ఆల్ రైట్స్ 13కోట్లు అంటే కాస్త భారీనే. బాహుబలి సిరీస్ ను పక్కన పెడితే, మరే సినిమాకు ఇంత రేటు వచ్చిన దాఖలా లేదు. మురగదాస్-స్పైడర్ సంగతి తెలియదు. ఎందుకుంటే దాని హిందీ హక్కులు అన్నీ డైరక్టర్ మురుగదాస్ దగ్గర వున్నట్లు తెలుస్తోంది. మరి ఏ రేటు కట్టి ఆయనకు ఇచ్చారో తెలియాల్సి వుంది.
ఆ సంగతి అలా వుంచితే ఇది మాత్రం భారీ రేటే. ఇక భరత్ అనే నేను సినిమాకు ఓవర్ సీస్ హక్కుల బేరం కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు వినికిడి. రెండు సంస్థల మధ్య బేరాలు సాగుతున్నాయి. ఎవరికి ఫైనల్ అవుతందన్నది ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది. 18 నుంచి 20కోట్ల రేంజ్ లో ఓవర్సీస్ రైట్స్ పలికే అవకాశం వుంది.