నిర్మాత బండ్ల గణేష్ చాలా చిత్రమైన మనిషి. ఒక పక్క రాహుల్ గాంధీని కలుస్తారు. ఇంకోపక్క వెంకయ్య నాయుడు గారినీ కలుస్తారు. మళ్లీ మాట్లాడితే లగడపాటితో స్నేహం చేస్తారు. ఇటీవల కడప ఉక్కుపై దీక్ష చేసిన సిఎమ్ రమేష్ ను పరామర్శించారు. ఏమిటిది? పవన్ తన దేవుడు అంటూ, ఆయనకు కిట్టని పార్టీ నేతను కలిసాడు అని వార్తలు పుట్టుకు వచ్చాయి.
కానీ అసలు విషయం వేరు అని తెలుస్తోంది. బండ్లకు, సిఎమ్ రమేష్ కు గతంలో వ్యాపార బంధాలు వున్నాయని తెలుస్తోంది. బండ్లకు ఓ ఇన్ ఫాస్ట్రక్చర్ కంపెనీ లాంటిది ఏదో వుండేదట. దాన్ని కూడా రెండో బిడ్, మూడో బిడ్ లాంటి వాటి కోసం సిఎమ్ రమేష్ వాడేవారని తెలుస్తోంది. అంటే ఒక విధంగా డమ్మీ కాంపిటీషన్ అన్నమాట. ఇలా కొన్ని రకాల వ్యాపార బంధాలు వారి మధ్య కొన్నాళ్లు సాగాయని తెలుస్తోంది. అందుకే ఓసారి కలిసి పరామర్శించి వచ్చాడట బండ్ల.
అందరూ అనుకునేంత చిత్రమైన కేండిడేట్ ఏం కాదు బండ్ల. ఏం చేసినా, దాని వెనుక ఓ పరమార్థం, ప్రయోజనం చూసుకుంటాడు. కాంగ్రెస్ లోకో, భాజపాలోకో వెళ్లి రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకుంటున్నాడు బండ్ల. సినిమాలు అయిపోయాయి. మరి రాజకీయాలు ఏం చేస్తాడో చూడాలి.