ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిపాదన బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుమానం చాలా మందికి. యంగ్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే సూపరే సూపరు. కానీ అది సాధ్యం కాని వ్యవహారం అని సినిమా వార్తలు తరచు తెలుసుకునే అందరికీ తెలుసు. ఎందుకంటే బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య చాలా అంటే చాలా దూరం వుంది. మరేం చేస్తారు?
దీనికి గతంలో బయోపిక్ కు ఒకటో కృష్ణుడు టైప్ లో వ్యవహరించిన దర్శకుడు తేజ ఓ మధ్యే మార్గం కనిపెట్టారు. అదేంటీ అంటే యంగ్ హీరో శర్వానంద్ ను యంగ్ ఎన్టీఆర్ పాత్రలో అక్కడక్కడ చూపిద్దామని. సినిమాల్లోకి వచ్చి, రెండు మూడు సంఘటనలు చూపించిన తరువాత బాలయ్య ను తెరపైకి తెచ్చేద్దామని తేజ ప్రతిపాదించారు. దానికి దాదాపుగా బాలయ్య కూడా ఓకె అన్నారు.
అసలు ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే, ఆ మధ్య వచ్చిన శతమానం భవతి సినిమాలో శర్వానంద్ కాస్త పీరియాడిక్ లుక్ లో నటించాడు. అక్కడ ఎన్టీఆర్ స్టయిల్స్ చూపించాడు. సో ఆ విధంగా ఎన్టీఆర్ బయోపిక్ లోకి శర్వానంద్ ఎంట్రీ వుంటుందని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఆ సినిమాకు రెండో కృష్ణుడు ఎంట్రీ ఇచ్చారు. అదే దర్శకుడు క్రిష్. ఆయన మొత్తం ప్లాన్ లు మార్చేస్తున్నారు. అందులో ఒకటేమిటంటే, యంగ్ ఎన్టీఆర్ గా కూడా ఎక్కువగా బాలయ్యనే చూపించాలన్నది. శర్వానంద్ ను వాడుకున్నా కూడా వీలయినంత తక్కువ వాడాలని, సినిమాల్లోకి ఎంట్రీ దగ్గర నుంచి బాలయ్యనే చూపించాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా పాతాలభైరవి లాంటి క్లాసిక్ ఎపిసోడ్ లు బయోపిక్ లో కొన్ని వున్నాయట. వీటన్నింటిని బాలయ్యతోనే చేయాలని అనుకుంటున్నారట.
అందుకోసం ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్, గ్రాఫిక్స్, కరెక్షన్ లాంటి టెక్నాలజీని ఎక్కువగా వాడతారట. అంటే బాహుబలి 2 కోసం అనుష్క కోసం ఎక్కువగా వాడారని ఆ మధ్య వినిపించింది. అంటే మనిషిని వీలయినంత డిజిటల్ గా చెక్కేయడం అన్నమాట.
అధికారం వరకే తొలి పార్ట్
ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి అధికారం సాధించడం వరకే బయోపిక్ తొలి ఫార్ట్ వుంటుంది. సినిమా ముగింపు టైమ్ లో, అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ సాధించిన సంక్షేమ విజయాలు, వగైరా రెండో భాగంలో అని ఎండింగ్ కార్డ్ వేస్తారు. ఆ విధంగా సినిమాకు మరో భాగం వుందని చెప్పకనే చెబుతారు. అప్పటి దాకా బయోపిక్ రెండు భాగాలు అన్నది రివీల్ చేయరు.
అలాగే తొలి భాగంలో చంద్రబాబు తిరుగుబాటు, ఎన్టీఆర్ పదవీ చ్యుతి లాంటి వ్యవహారాలు వుండవు. చంద్రబాబుతో క్రిష్ ఈ విషయమై డిస్కస్ చేస్తున్నారు అన్నవి అన్నీ గాలి వార్తలే అని యూనిట్ వర్గాల బోగట్టా.