బిడ్డ పోయినా పురిటికంపు పోలేదని సామెత. నిర్మాత బెల్లంకొండ తీసిన జబర్దస్త్ సినిమా వ్యవహారం అలాగేవుంది. డైరక్టర్ నందినీ రెడ్డి హిందీ సినిమాను నేరుగా, నిర్మొహమాటంగా కాపీకొట్టేసి తీసిన జబర్దస్త్ సినిమా డిజాస్టర్ అయింది. సమంత నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన దాని మీద కేసులు మాత్రం నడుస్తూనే వున్నాయి.
తమ సినిమాను కాఫీ కొట్టేసారని హిందీ సినిమా నిర్మాతలు కేసు వేయడంతో జబర్దస్త్ శాటిలైట్ ప్రసారం నిలిచిపోయింది. దాంతో తాము ఇచ్చిన మూడున్నర కోట్లు తమకు ఇచ్చేయమని ఆ చానెల్ నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ ను కోరింది. ఈ పంచాయతీ అలా నడుస్తూనే వుంది. ఆఖరికి కోర్టుకు ఎక్కింది.
ఇప్పుడు కోర్టు బెల్లంకొండపై అరెస్టు వారంట్ ఇచ్చింది. మొత్తానికి సినిమా పోయింది, కాపీ కొట్టారన్న ఆరోపణతో పరువుపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ అరెస్ట్ వారంట్ ఒకటి. ఒక కొడుకు హీరో అయ్యాడు. మరో కొడుకును హీరో చేయాలనే ప్రయత్నంలో వున్నాడు. కానీ ఈ ఆనందం లేకుండా చేస్తోంది నందినీరెడ్డి జబర్దస్త్ సినిమా.