బిగ్ బాస్ సీజన్-3పై భారీఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. చివరికి కోర్టు కేసులు, పోలీసు కేసులు కూడా పడ్డాయి. మరోవైపు ఆడియన్స్ నుంచి కూడా ఈ రియాలిటీ షోకు పెద్దగా రెస్పాన్స్ రాలేదంటూ కథనాలు వచ్చాయి. అయితే బుల్లితెర వీక్షకులు మాత్రం తిట్టుకుంటూనే ఈ షో చూస్తున్నారనే విషయం ఇవాళ్టితో తేలిపోయింది. రేటింగ్స్ లో బిగ్ బాస్ దుమ్ముదులిపింది.
21వ తేదీ ఆదివారం ప్రసారమైన ఈ ఎపిసోడ్ కు అచ్చంగా 17.92 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. గతంలో ఎన్టీఆర్, నాని చేసిన మొదటి షోలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎన్టీఆర్ బిగ్ బాస్ గా వ్యవహరించిన సీజన్-1 మొదటి ఎపిసోడ్ కు అత్యధికంగా 16.18 టీఆర్పీ వచ్చింది. సెకెండ్ సీజన్ లో నాని చేసిన మొదటి ఎపిసోడ్ కు 14.91 టీఆర్పీ వచ్చింది.
ప్రస్తుతం ఈ షోతో 1108 జీఆర్పీతో దూసుకుపోతోంది స్టార్ మా ఛానెల్. మొదటి సీజన్ లో ఎలాగైతే ఎన్టీఆర్ రాకతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుందో, అదే విధంగా తాజా ఎపిసోడ్ తో నంబర్ వన్ స్థానం ఆక్రమించింది మాటీవీ. ప్రస్తుతం సీజన్-3ను 4 కోట్ల 50 లక్షల మంది వీక్షిస్తున్నారు.
తాజా టీఆర్పీలతో బిగ్ బాస్ సీజన్-3కి ఆదరణ తగ్గిందనే అనుమానాలు పటాపంచలయ్యాయి. ఓవైపు వివాదాలు నడుస్తున్నప్పటికీ బుల్లితెర వీక్షకులు ఈ రియాలిటీ షోను చూస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు నాగార్జున రాకతోనే సీజన్-3 ఇంత పెద్ద హిట్ అయిందంటూ అక్కినేని అభిమానులు సంబరాలు షురూ చేశారు.