తాము తీసిన సినిమాలపై ఏ నిర్మాత, దర్శకులకైనా ఫుల్ కాన్ఫిడెన్స్ వుండడం సహజం. కానీ భారీ సినిమాలు తీసేటపుడు మాత్రం విడుదల దగ్గరకు వచ్చేసరికి కాస్త టెన్షన్ కామన్. అయితే భరత్ అనే నేను సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ఇద్దరూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో వుండడం విశేషం.
సినిమా బిజినెస్ విషయంలో మొత్తం తానే చక్రం తిప్పారు దర్శకుడు కొరటాల శివ. తన భరోసా మీద, తరువాత సినిమా సమయంలో అవసరమైతే సర్దుబాటు చేస్తానని చెప్పి మరీ అనుకున్న రేట్లు వచ్చేలా చేసారు కొరటాల శివ. అందువల్ల సినిమా విషయంలో ఆయనకు ఎంత భరోసా వుందో, అంతకు అంతా టెన్షన్ వుండాలి. కానీ శివ సన్నిహిత వర్గాలు చెబుతున్నది మాత్రం వేరుగా వుంది. శివలో ఆ టెన్షన్ మచ్చుకు కూడా లేదని, పూర్తి కాన్ఫిడెన్స్ తో వున్నారని అంటున్నారు.
ఇక వంద కోట్ల మేరకు వరల్డ్ వైడ్ గా థియేటర్ హక్కులు అమ్మారు నిర్మాత దానయ్య. మరి ఆ మేరకు టెన్షన్ చాలా వుండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పైడర్, అజ్ఞాతవాసి లాంటి ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు దెబ్బతీసి, నిర్మాతలను చాలా ఇబ్బంది పెట్టాయి.
కానీ భరత్ విషయంలో నిర్మాత దానయ్య చాలా హుషారుగా కనిపిస్తున్నారట. దీనికి చాలా కారణాలు వున్నాయి. ఎందుకంటే సినిమాకు చేస్తున్న పబ్లిసిటీకి చాలా కార్పొరేట్ సంస్థలు తాము ఫ్రీగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయట. ట్విన్ సిటీస్ లో వందలాది హోర్డింగ్ లు ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాయట. అలాగే వివిధ రకాలైన స్పాన్సర్ షిప్ లు వస్తున్నాయట.
అందువల్ల సినిమాకు మరింత పబ్లిసిటీ రావడం కాకుండా, అదనపు ఆదాయం వస్తోంది. ఈ సినిమాకు అన్నీ కలిపి పన్నెండు నుంచి 15కోట్లు దానయ్యకు లాభంగా మిగుల్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లాభం సంగతి అలా వుంచితే, బ్యానర్ వాల్యూ పెంచే సినిమా అవుతుందని దానయ్య మాంచి కాన్ఫిడెన్స్ తో వున్నారని తెలుస్తోంది.
నిర్మాత దర్శకుల సంగతి అలా వుంచితే హీరో మహేష్ బాబుకు అస్సలు టెన్షన్ కనిపించడం లేదు. ఈ సినిమా విజయం అతగాడికి చాలా అవసరం. అయినా మహేష్ టెన్షన్ ఫ్రీగా వున్నారు. ఫ్యామిలీతో హాయిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తం మీద భరత్ సినిమా హీరో, డైరక్టర్, నిర్మాత చాలా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.