బాలయ్య ఎమ్మెల్యే అయిన తరువాత వస్తున్న సినిమా లయన్. దీని అడియో ఫంక్షన్ కు కాస్త భారీ ఏర్పాట్లే సాగుతున్నాయి. తొలిసారి వేదికపై త్రీడీ తెరలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం గుజరాత్ నుంచి సాంకేతిక బృందం వచ్చింది. వివిధ జిల్లాల నుంచి బాలయ్య అభిమానులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వస్తుండడంతో, వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఇదిలా వుంటే మొత్తం ఫంక్షన్ పాస్ లు అన్నీ బాలయ్య తన ఆధీనంలో వుంచుకుని, కార్యకర్తలు, అభిమానులకు తానే అందిస్తున్నట్లు వదంతులు గుప్పు మన్నాయి. కానీ యూనిట్ వర్గాలు దీన్ని ఖండిస్తున్నాయి. ముందుగానే పద్దతి ప్రకారం జాబితాలు జిల్లాల వారీగా సిద్ధం చేయించి మరీ పాస్ లు పంపిణీ చేయించారంటున్నారు.
అలాగే వచ్చేవారికి ఎవరికీ ఏలోటూ రాకూడదని, అవసరమైన వారికి తిండి కూడా ఏర్పాటు చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని బాలయ్య ఆదేశించారట. పాస్ ల కోసం విపరీతమైన వత్తిడి వుందని, జనం లెక్కకు మించి రావాలనుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వుందని తెలుస్తోంది.అయితే ముందుగా వేసుకున్న లెక్కలు, జాబితాల ప్రకారం పాస్ ల పంపిణీ పూర్తి చేసారట. మొత్తానికి బాలయ్య సినిమాకు ఓ మినీ మహానాడు అంత హడావుడి జరుగుతోంది.