నితిన్-వెంకీ కుడుముల సినిమా విడుదలై వారం దాటిపోయింది. బయ్యర్లు అందరూ సేఫ్ అయిపోయారు. కమిషన్లు కూడా వస్తాయి ఈ వారం దాటితే. కానీ పెద్ద హిట్ అవుతుంది అనుకున్న సినిమా జస్ట్ హిట్ మార్క్ దగ్గర ఆగిపోయేలా కనిపిస్తోంది. దీనికి కీలక కారణం విడుదల డేట్ నే. పరిక్షలు ఫీవర్ స్టార్ట్ కావడానికి జస్ట్ వారం ముందుగా విడుదల చేయడంతో రన్ తగ్గిపోయినట్లు కనిపిస్తోంది.
తొలి మూడు రోజుల్లో మంచి కలెక్షన్లు నమోదు చేసి, మండే నుంచి సగటు ఫలితాలు నమోదు చేయడం ప్రారంభించింది. దీని వల్ల ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి బయ్యర్లు అంతా పెట్టుబడులు ప్లస్ ఖర్చులు మాత్రం వెనక్కుతెచ్చుకోగలిగారు. కమిషన్లు మాత్రం ఇంకా రావాల్సి వుంది. ఈ వారం కూడా మరీ పెద్ద రన్ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇంటర్ పరిక్షలు మొదలవుతున్నాయి. ఆ తరువాత టెన్త్ పరిక్షలు వున్నాయి.
నిజానికి నితిన్ మార్కెట్ తో పోల్చుకుంటే భీష్మ మంచి ఫలితాలే నమోదు చేసింది. ఎందుకంటే వరుస ఫ్లాపుల్లో వున్నాడు నితిన్. కానీ కాస్త మంచి డేట్ పడి వున్నా, లేదా సమ్మర్ విడుదల అయినా ఇంకా మంచి ఫలితాలు నమోదు చేసి వుండేది. వరల్డ్ వైడ్ గా ముఫై నుంచి నలభై కోట్లు చేస్తుందేమో అనుకున్న సినిమా జస్ట్ పాతిక కోట్ల దగ్గరే ఆగిపోయేలా వుంది.
ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి అంటే, డేట్ తో పాటు సినిమాను కూడా మరికాస్త బెటర్ గా చేసి వుండే అవకాశం వుంది. అది కూడా మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అయితే యునానిమస్ హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి, ఇక డేట్ అడ్వాంటేజ్ లేదు అని మాత్రమే చెప్పుకోవాలేమో?