ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న! ఈ నీతిని జనసేనాని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా నిరూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర అంటే తనకు ఎంతో ప్రేమ, అక్కడి ప్రజల మంచితనం, అమాయకత్వం తనకు ఎంతో ఇష్టం అంటూ.. ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పిన… ఎన్నికల సమయంలో.. కేవలం ఉత్తరాంధ్ర మీద ప్రేమతోనే అక్కడినుంచి పోటీచేస్తున్నట్లుగా ప్రకటించుకున్న పవన్ కల్యాణ్… ఎన్నికలు ముగియగానే.. అక్కడి ప్రజలు తనను అవమానకరంగా ఓడించగానే.. వారి పట్ల ప్రేమకు తిలోదకాలు ఇచ్చేసినట్లున్నారు. కనీసం పార్టీ తరఫున ఎంతో అరుదుగా మాత్రమే జరిగే జిల్లా సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి కూడా ఆయన స్వయంగా సమయం కేటాయించడం లేదు.
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై కనీసం దృష్టిపెట్టని జనసేనాని.. అప్పుడప్పుడూ జిల్లాల సమీక్ష సమావేశాలు మాత్రం నిర్వహిస్తుంటారు. ఇటీవలే హైదరాబాదులో కర్నూలు జిల్లా సమీక్ష సమావేశాలను కూడా నిర్వహించారు. తాజాగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల సమీక్ష సమావేశాలను విశాఖలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. అయితే ఈ సమావేశాలకోసం కేవలం మూడురోజుల సమయం కేటాయించడానికి హీరోగారికి కాల్షీట్లు దొరకలేదు. ఇవన్నీ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. జనసేనాని పరోక్షంలో పార్టీ కీలక సమావేశాలు జరగడం దాదాపుగా ఇదే ప్రథమం.
తనను ఓడించారు గనుక.. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర వాసుల మొహం చూడదలచుకోలేదా? లేక, జగన్మోహన రెడ్డి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయదలచుకున్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అక్కడ పార్టీ సమావేశాలకు స్వయంగా హాజరైతే, తమ సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఎదురుదాడి ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నారో ఏమో గానీ.. మొత్తానికి ఉత్తరాంధ్ర సమావేశాలకు పవన్ డుమ్మా కొడుతున్నారు.
పవన్ కల్యాణ్ కు నిజంగానే అమరావతిలో రాజధాని గురించి చిత్తశుద్ధి ఉంటే.. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలి. అమరావతికి మాత్రమే తమ పార్టీ ఎందుకు జైకొడుతున్నదో… విశాఖలో రాజధాని ఎందుకు వద్దంటున్నదో వారికి చెప్పాలి.. వారిని ఒప్పించాలి.. వారి ద్వారా తమ వాదనను అక్కడి ప్రజల్లోకి కూడా పంపాలి. అది సబబుగా ఉంటుంది. కానీ తన వాదనలోనే బలం లేనప్పుడు.. అలాంటి సాహసం పవన్ చేయగలడనుకోవడం భ్రమ.
ఇంటి పనులతో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంకర్ ?
అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నపుడే ప్రొడ్యూసర్స్ పై కంప్లైంట్ ఇచ్చేవాడు