ఈ వారం ‘తప్పంటే…రాక్షసులేనా?’ శీర్షికతో రాసిన ‘కొత్త పలుకు’లో యధావిధిగానే ఆర్‌కే జగన్‌పై అక్షర దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఏకంగా మీడియానే రాక్షసులుగా జగన్ అభివర్ణించారంటూ ఆర్‌కే రంకెలేశాడు. మీడియాను అంటే ఆర్‌కేకు ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. తనదో మీడియా వ్యవస్థని, తానొక మహా జర్నలిస్టు అని ఆర్‌కే భ్రమల్లో ఉన్నట్టున్నాడు. భ్రమకు, వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా భూమికి, ఆకాశానికి ఉన్నంత.
ఇదే కొత్త పలుకులో ఇదేనా మీడియా తప్పు అంటూ జగన్ సర్కార్ నిర్ణయాల్లోని తప్పిదాలను ప్రస్తావిస్తూ, ప్రశ్నిస్తూ … ‘ఆత్మస్తుతి.. పరనింద’ ఎంతో కాలం సాగదని కూడా హెచ్చరించాడు. ఈ వాక్యం తనకు మాత్రం వర్తించదని ఆయన ఎందుకు అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. తానొక జర్నలిస్టునని, తనదొక మీడియా సంస్థని అనుకోవడం ఆత్మస్తుతి అవుతుంది. అలాగే మీడియా సంస్థగా తన పత్రిక, చానల్ జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఇష్టమొచ్చిన రాతలు రాయడం పరనిందే అవుతుంది.
‘మీడియా సంస్థలు విమర్శలకు అతీతం కాకపోయినా, రాజకీయ పార్టీలు సహనం కోల్పోయి మీడియాకు కులం, రాజకీయం పులుముతుండటం తెలుగునాట అధికంగా ఉంటోంది’…అని ఆయనే ఒక చోట రాసుకొచ్చారు. రాజకీయ పార్టీలకు మాత్రమే సహనం ఉండాలా? మీడియా సంస్థలకు అవసరం లేదా? అసలు రాధాకృష్ణ ఇంకా తానొక జర్నలిస్టుగా భావించడమే అతిపెద్ద జోక్. తనది మీడియా వ్యవస్థగా భావించడమే మరో పెద్ద కామెడీ. ఈ సందర్భంగా రాధాకృష్ణను కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాం.
జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ 2019, నవంబర్ 17న ఆర్‌కే ఏపీలో ‘రహస్య అజెండా’! శీర్షికతో రాసిన కొత్తపలుకులో ఈ వాక్యాలను చదవండి.
‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదం గా మారిన ‘ఇంగ్లిష్ మీడియంలోనే విద్యా బోధన’ అనే ప్రభుత్వ నిర్ణయం వెనుక కూడా మత కోణం ఉందనీ, ముఖ్యమంత్రికి రహస్య ఎజెండా ఉందనీ ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. దేశంలో క్రైస్తవమత వ్యాప్తికి మిషనరీ స్కూళ్లు ఇతోధికంగా కృషి చేసిన విషయం తెలిసిందే. పేద ప్రజలకు మేలు చేయడం కోసమని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడితే బీసీలనుకూడా క్రైస్తవ మతంలోకి సులువుగా మార్చవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు శంకిస్తున్నారు’
ఎవరో సాధారణ మండల విలేకరి కుల, మత ప్రస్తావన తెస్తూ వార్త రాశాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక పత్రిక, చానల్ ఎండీ రాయాల్సిన వాక్యాలేనా ఇవి? మత విద్వేషాలను రెచ్చగొట్టడం సరైందా? ఈయనా నీతి వాక్యాలు చెప్పేది?
అలాగే అనంతపురం జిల్లా నుంచి కియా పరిశ్రమ తరలిపోతోందని రాయిటర్స్ వార్తా సంస్థ ఏదో కథనం రాస్తే…అదే నిజమైనట్టు ఆంధ్రజ్యోతిలో కథనం రాయడంతో పాటు ఏబీఎన్‌లో 24 గంటలూ చర్చా కార్యక్రమాలు నిర్వహించలేదా? ఇదేనా మీడియా సత్యశోధన. చివరికి ఏమైంది? ఆ కథనం తప్పని తేలలేదా?
విశాఖలో మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికలో నేవీ వాళ్లు అడ్డుపడ్డారని కథనం వచ్చింది. ఆ కథనాన్ని పట్టుకుని విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే కాదు..మిలీనం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దంటూ..ఏపీ ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేసింది. దేశ రక్షణకు సంబంధించిన అనేక కార్యాలయాలు, నేవికి సంబంధించిన పరిశోధన సంస్థలు, ఐఎన్‌ఎస్ కళింగ, జలాంతర్గాముల తయారీ కేంద్రాలు అన్ని కూడా విశాఖలోనే ఉన్నాయని, ఒకవేళ విశాఖను పరిపాలన రాజధానిగా ఆ ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోతుందని, దీని వల్ల దేశరక్షణకు అనేక సమస్యలు తలెత్తుతాయంటూ ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం చేయలేదా?.
ఎల్లోమీడియా ప్రచారాన్ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తీవ్రంగా ఖండించలేదా? మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేవీ అధికారులు స్పష్టం చేయలేదా?
అలాగే చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి ఎల్లో మీడియా ఎందుకు మౌనం పాటించిందో ఆర్‌కే సమాధానం చెబుతాడా? అంతెందుకు ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి. ‘జై అమరావతి’ శీర్షికతో బ్యానర్ కథనం ఇచ్చారు. ఈ కథనం ఉపశీర్షికలను ఒక్కసారి పరిశీలిద్దాం. న్యాయం కోసం ఎత్తిన పిడికిలి, రాష్ట్రచరిత్రలో సుదీర్ఘ పోరాటం, రెచ్చగొట్టినా…కట్టు తప్పని ఉద్యమం, వేదన తట్టుకోలేక 49 మంది మృతి…అని ఇచ్చారు. అయ్యా ఆర్‌కే గారు దీన్ని ‘న్యూస్’ అంటారా? ‘వ‌్యూస్’ అంటారా?
అమరావతిలో ఎవరు చచ్చినా రాజధాని కోసమేనా? అయ్యా చావడం అంటే సీఏఏ, ఎన్ఆర్‌పీ, ఎన్ఆర్‌సీ కోసం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల గురించి చెప్పుకోవాలి. అలాగే ఢిల్లీలో ఇటీవల 42 మంది పైబడి చనిపోయిన వారి గురించి చెప్పుకోవాలి. అంతేకానీ రాజధానిలో మీరు చెబుతున్న మరణాలన్నీ…బాబు కోసం మీరు చంపినవే. అంతే తప్ప అందులో నిజాలు లేవు.
‘కొన్ని పత్రికలు, న్యూస్ చానెళ్లు రాక్షసులుగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిట్టిపోయడం మొదలెట్టారు. ఒకప్పుడు మీడియాలో అవాస్తవ వార్తలొస్తే ఆయా ప్రభుత్వాలు వివరణలు పంపేవి. ఇప్పుడు అలా కాకుండా ఎదురుదాడికి దిగుతున్నాయి’
ఒకప్పుడు అంటే ఆర్‌కే ఎప్పటి కాలం గురించి చెబుతున్నారో తెలియడం లేదు. ఇప్పుడు మాత్రం నిజాలను రాసే మీడియా గురించి భూతద్దంతో వెతుక్కున్నా దొరకని పరిస్థితి. ఇసుక నుంచి తైలాన్ని అయినా తీయవచ్చేమో కానీ, ఆంధ్రజ్యోతి నుంచి నిజాలను రాయించడం అసాధ్యం.
‘జాతీయ మీడియాను, అంతర్జాతీయ మీడియాను కూడా చంద్రబాబు డబ్బుతో కొన్నారా? ఏ మీడియానైనా అలా డబ్బుతో కొనగలరా? కొంటే ఎంత కాలం? మీడియా దారి తప్పితే కడిగిపారేయడానికి ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది’
ఆర్‌కే ఎంత చిలిపో ఈ వాక్యాలే చెబుతాయి. పిండి కొద్ది రొట్టె అంటారు. జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా వార్తలు ఏమైనా అమ్మకానికి అతీతమా? ఆర్‌కే అమాయకత్వమా లేక అజ్ఞానమా? స‌్థానిక మీడియాను పది రూపాయలకు కొంటే, జాతీయ మీడియాను రూ.100కు, అంతర్జాతీయ మీడియా అయితే రూ.1000. అంతే తేడా. అమ్మకం సరుకు ఒకటే. ధరలోనే వ్యత్యాసం.
తమను రాక్షసులుగా సీఎం జగన్ నిందిస్తున్నాడని ఆర్‌కే ఆవేదనలో అర్థం ఉంది. జగన్ అలా అనుకుండా ఉండాల్సింది. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే తమను ఆర్‌కే, రామోజీలాంటి వాళ్లతో పోల్చడం రాక్షసులు అవమానంతో చచ్చిపోతున్నాయట. తప్పుడు కథనాలు రాసేవాళ్లను, చూపేవాళ్లను జగన్ తమతో పోల్చకూడదని రాక్షసులు విజ్ఞప్తి చేశాయట. ఇక మీదట తప్పుడు కథనాలు రాసేవాళ్లను రాధాకృష్ణ, రామోజీ అని పిలిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వీళ్ల రాతల కంటే ఆ రాక్షసులే నయం కాబట్టి.