పెళ్లిళ్ల పేరుతో పలువురి వద్ద డబ్బు కాజేసి వంచించిన నటి శ్రుతి భాగోతం ఒకొక్కటిగా బయటపడుతోంది. ఈమె నటించిన సినిమా ఒకటే అయినా….జీవితంలో మాత్రం అంతకు మించి నటించింది. లగ్జరీలకు అలవాటు పడ్డ ఆ యువతి…తన అందాన్ని ఎరగా వేసి…మోసానికి పాల్పడింది. తమిళనాడులోని మైలాపూర్‌కు చెందిన నటి శ్రుతి ‘ఆడి పోనా ఆవడి’ అనే తమిళ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో సినిమా అవకాశాలు రాలేదు.
దీంతో ఆమె చదువుకోవడానికి లండన్ వెళ్లింది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రమే శ్రుతికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వరుడి కోసం మ్యాట్రిమనిలో పేరు నమోదు చేశారు. శ్రుతి అందానికి జర్మనీ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోవైకు చెందిన బాలమురుగన్ ఫిదా అయ్యాడు. శ్రుతిని పెళ్లి చేసుకోవడానికి తహతహలాడాడు. శ్రుతితో అతను పరిచయం పెంచుకున్నాడు. అలా కొన్నిరోజులు గడిచిపోయాయి.
ఒకరోజు శ్రుతి నుంచి ఫోన్ వచ్చింది. ఆమె మాటల్లో ఆందోళన. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, వైద్య ఖర్చులకు డబ్బు అవసరం అయ్యిందని ఆవేదనతో శ్రుతి చెప్పింది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం, కాబోయే మామకు ఆరోగ్యం బాగా లేదంటే బాలమురుగన్ మనసు వలవిలలాడింది. అందులోనూ నోరు తెరిచి అడిగిన సాయం…కాదనలేకపోయాడు. వెంటనే బాలమురుగన్ రూ.45 లక్షలను నటి శ్రుతికి ఇచ్చాడు.
పథకం ప్రకారం తాను అనుకున్నంత సొమ్మును రాబట్టుకున్న తర్వాత, బాలమురుగన్‌కు శ్రుతి దూరం కావడం మొదలెట్టింది. ఆమె మోసాన్ని గ్రహించిన బాలమురుగన్ తల్లిదండ్రులు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో నటి శ్రుతి పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తోందన్న విషయం వెలుగు చూసింది. నటి శ్రుతిని, ఆమె తల్లి చిత్రను, సహోదరుడు సుభాష్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తరువాత బెయిల్లో బయటకు వచ్చిన నటి చదువు కోవడానికి లండన్ వెళ్లింది.
కాగా నటి శ్రుతి మోసానికి చెన్నై, ముగప్పేర్‌కు చెందిన అముదన్ కూడా బలయ్యాడు. ఇతనిపై నటి తల్లి చిత్ర రెండు రోజుల క్రితం స్థానికి మైలాపూర్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగప్పేర్‌కు చెందిన వ్యాపారస్తుడు అముదన్ వెంకటేశన్ నటి తనకు కాబోయో భార్య అని లక్షలాది రూపాయలు శ్రుతికి ఖర్చు చేశాడు. అయితే నటి తల్లి ఫిర్యాదు మేరకు హత్యా బెదిరింపుల కింద అముదన్‌ను, ఆయన తండ్రిని రాజగాపాల్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.