బిగ్‌బాస్ షోలో కౌశ‌ల్ ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌

మాటీవీలో ప్రసార‌మ‌వుతున్న బిగ్‌బాస్ షోలో కెప్టెన్సీ ఎన్నిక‌లో కౌశ‌ల్ ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌కు దిగ‌డం వీక్షకుల‌కు అస‌హ‌నం తెప్పించింది. అస‌లు షోలో ఎన్నిక‌ల‌ నిబంధ‌న‌లు వ‌ర్తించేలా లేవు. షోనే కావ‌చ్చు.. కాని ఎన్నిక‌లు ప‌క్కాగా…

మాటీవీలో ప్రసార‌మ‌వుతున్న బిగ్‌బాస్ షోలో కెప్టెన్సీ ఎన్నిక‌లో కౌశ‌ల్ ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌కు దిగ‌డం వీక్షకుల‌కు అస‌హ‌నం తెప్పించింది. అస‌లు షోలో ఎన్నిక‌ల‌ నిబంధ‌న‌లు వ‌ర్తించేలా లేవు. షోనే కావ‌చ్చు.. కాని ఎన్నిక‌లు ప‌క్కాగా జ‌రిగాలి క‌దా. నోరున్న వారిదే రాజ్యం అన్నట్టుగా కౌశ‌ల్ వ్యవ‌హారం షోలో ఇత‌ర స‌భ్యులెవ్వరికీ న‌చ్చడంలేదు. తానొక్కడే గేమ్ అడుతున్నట్టు, ఇత‌రుల్లో సీరియ‌స్‌నెస్ లేన‌ట్టు అత‌ని మాట‌ల తీరు తెలియ‌జేస్తోంది. శుక్రవారం జ‌రిగిన కెప్టెన్సీ ఎన్నిక సంద‌ర్భంగా ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని కౌశ‌ల్ అతిక్రమించారు. దీన్ని అడ్డుకోవాల్సిన బిగ్‌బాస్, సంచాల‌కురాలు శ్యామ‌ల నిమ్మకు నీరెత్తిన‌ట్టు వ్యవ‌హ‌రించ‌డం విమ‌ర్శల‌కు తావిచ్చింది.

దీప్తి, కౌశ‌ల్ మ‌ధ్య కెప్టెన్సీ కోసం పోటీ జ‌రిగింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఇంటి స‌భ్యులు త‌మ‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను తీసుకెళ్లి త‌మ‌కు న‌చ్చిన అభ్యర్థి నిలిచిన వెయింగ్ మిష‌న్‌లో వేయాలి. అంతిమంగా ఎవ‌రికైతే ఎక్కువ వెయిటేజీ వ‌స్తుందో వారే కెప్టెన్‌గా గెలిచిన‌ట్టు. కెప్టెన్సీ టాస్క్ ఎన్నిక ప్రక్రియ మొద‌లువుతుంది. ముందుగా కౌశ‌ల్ మాట్లాడుతూ మొద‌టి నుంచి ఎవ‌రైతే న‌మ్మకంగా, నిజాయ‌తీగా, సేప్ గేమ్ ఆడ‌కుండా అంటే న‌టించ‌కుండా ఉన్నార‌నిపిస్తే వారికే ఓట్లు వేయాల‌ని అప్పీల్ చేస్తారు. మీరు వేసే ఓటుతో నేను ఏకీభ‌విస్తాన‌న్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాల‌ని ప్రార్థిస్తున్నట్టు హుందాగా వ్యవ‌హ‌రించారు.

ఆ త‌ర్వాత దీప్తి మాట్లాడుతూ చాలాసార్లు కెప్టెన్సీ నామినీగా నిల‌బ‌డ్డాన‌ని, గట్టిగా ప్రయ‌త్నించాన‌ని చెప్పుకొచ్చారు. త‌న శ‌క్తి మేర‌కు కృషి చేశాన‌ని, కానీ కెప్టెన్‌గా గెల‌వ‌లేకపోయాన‌ని వాపోయారు. తాను కెప్టెన్‌ అయితే ఇంటి స‌భ్యుల‌ను చ‌క్కగా చూసుకుంటాన‌ని, వంద‌శాతం బాధ్యత‌గా వ్యవ‌హ‌రిస్తాన‌ని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కెప్టెన్ కాక‌మునుపు ఒక‌లా, అయిన త‌ర్వాత మ‌రోలా ఉండ‌న‌ని ఆమె విన్నవించుకున్నారు. అంతేకాకుండా ఇంతవ‌ర‌కు ఏదైనా సంద‌ర్భంలో ఎవ‌రి మ‌న‌సునైనా నొప్పించి ఉంటే క్షమించాల‌ని వేడుకున్నారు. ఒక్కసారి త‌న‌కు కెప్టెన్‌గా అవ‌కాశం ఇవ్వాల‌ని అర్తించారు. చివ‌రిగా కౌశ‌ల్ కూడా మ‌న ఇంటి స‌భ్యుడేన‌ని, మీరు ఎవ‌రికి మ‌ద్దతు ఇచ్చినా స్పోర్టీవ్‌గా తీసుకుంటాన‌ని ఇంటి స‌భ్యుల మ‌న‌సుల‌ను ఆమె గెలుచుకున్నారు.

త‌ర్వాత ఎన్నిక ప్రక్రియ మొద‌ల‌వుతుంది. ఓట‌ర్లు వెయింగ్ మిష‌న్ల ద‌గ్గర‌కు క్యూక‌ట్టారు. ఇదే స‌మ‌యంలో ఓటు వేసేందుకు గీతామాధురి వ‌చ్చిన‌ప్పుడు ఆమెకు కౌశ‌ల్ హిత‌బోధ చేశారు. ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇచ్చి మీరు దీప్తికి ఓటు వేయ‌వ‌చ్చు. కాని నేను కూడా మీకు ఫ్రెండ్ అనే విష‌యాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు అని నిష్టూర‌మాడుతారు. అయితే కౌశ‌ల్ రుణాన్ని తాను ఉంచుకోలేద‌ని, ఆయా సంద‌ర్భాల్లో అత‌నికి ఎలా మ‌ద్దతుగా నిలిచింది గీత వివ‌రించి దీప్తకి ఓటు వేస్తుంది.

పూజా వ‌చ్చిన‌ప్పుడు కూడా కౌశ‌ల్ క్లాస్ తీసుకుంటారు. దీప్తికి మ‌ద్దతు ఇవ్వాల‌నుకుంటున్నావ‌ని, నీ స్ఫూర్తితో నేను షోలో పుంజుకున్నాన‌ని త‌నవైపు తిప్పుకోవాల‌ని చూస్తారు. పూజా కూడా అంతే తెలివిగా కౌశ‌ల్‌ను ఆకాశానికెత్తి చివ‌ర‌కు దీప్తికి మ‌ద్దతుగా నిలుస్తుంది. ఆ త‌ర్వాత కౌశ‌ల్ అంద‌రినీ ఉద్దేశించి మాట్లాడుతూ మూడు వారాలుగా అంద‌రూ ఒక కుటుంబ స‌భ్యుల్లాగా ఉన్నామ‌ని, భేదాభిప్రాయాలు చూప‌కుండా ఓట్లు వేస్తార‌ని కోరుకుంటున్నాన‌న్నారు.

ఒక విష‌యంలో త‌న‌ను స‌మ‌ర్థించుకున్న కౌశ‌ల్‌కు సామ్రాట్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తామేమీ ఎర్రోళ్లం కాద‌ని కౌశ‌ల్‌కు అత‌ను బ‌దులిచ్చారు. రోల్‌రైడా వ‌చ్చిన‌ప్పుడు కూడా కౌశ‌ల్ తాను కెప్టెన్‌గా ఎవ‌రూ చేయ‌ని విధంగా సేవ‌లందించాన‌ని ఏక‌రువు పెట్టారు. గ‌తంలో దీప్తి త‌న‌కు మ‌ద్దతు ఇవ్వక‌పోయినా ఇప్పుడామెకే ఇస్తున్నట్టు రోల్ స్పష్టత ఇచ్చారు. మ‌ళ్లీ గీతాను, సామ్రాట్‌ను కౌశ‌ల్ టార్గెట్ చేశారు. చివ‌రికి అంద‌రినీ కౌశ‌ల్ ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేసినా ప్రయోజ‌నం లేక‌పోయింది. దీప్తిని విజ‌యం వ‌రిస్తుంది.

స‌హ‌జంగా ఎన్నిక జ‌రిగేట‌ప్పుడు ప్రచారం చేయ‌కూడ‌ద‌నేది మ‌న ఎన్నిక‌ల వ్యవ‌స్థ నిబంధ‌న పెట్టింది. ఎన్నిక‌ల ప్రచారాన్ని కూడా రెండురోజుల ముందే నిలిపేస్తారు. కాని బిగ్‌బాస్ షోలో ఒక‌వైపు ఎన్నిక ప్రక్రియ జ‌రుగుతోంటే కౌశ‌ల్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ‌టం వీక్షకుల‌కు ఇరిటేష‌న్ పుట్టించింది. పైగా బిగ్‌బాస్, సంచాల‌కురాలు శ్యామ‌ల ఏ మాత్రం అడ్డుకోకపోవ‌డం ఏంట‌ని వీక్షకుల నుంచి ప్రశ్నల వ‌ర్షం కురుస్తోంది. ఏంటో బిగ్‌బాస్ షోలో ఎప్పుడైనా, ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చంటే ఇదేనేమో?