మొత్తానికి ఓ రేర్ కాంబినేషన్ సెట్ కావడానికి అంకురార్పణ జరిగిపోయింది. మెగా నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిననట్లు బోగట్టా. ప్రస్తుతానికి కథ, డైరక్టర్ వంటి విషయాలు ఏమీలేవు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత సుకుమార్ డైరక్షన్ లో మైత్రికీ ఓ సినిమా చేయాలి. ఆ తరువాత సంగతి ఇది.
కానీ అలా అని తేలిగ్గా తీసేయాల్సిన సంగతికాదు. ఎందుకంటే, అల్లు అరవింద్ కు చెందిన గీతాఆర్ట్స్ మాగ్జిమమ్ మెగా హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. నాన్ మెగా హీరోలతో సినిమాలు చేసారు కానీ, చిన్న, మీడియం హీరోలతో తప్ప పెద్ద హీరోలతో కాదు.
అయితే ఇప్పుడు నిర్మాత అరవింద్ ట్రాక్ మార్చాలనుకుంటున్నారు. ఇకపై అందరు హీరోలతో గీతాఆర్ట్స్ పై సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయం మహేష్ దగ్గర ఆయనే స్వయంగా ప్రస్తావించినట్లు, దానికి మహేష్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మంచి కథ, కాంబినేషన్ ఎప్పుడు తెస్తే అప్పుడు చేద్దాం అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు గీతా ఆ క్యాంప్ ఆ పని మీద సీరియస్ గా వర్కవుట్ చేస్తోంది. ఇదిలా వుంటే కొరటాల శివ తరువాత సినిమాను అంటే 153వ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్నారు. ఇక బన్నీ-విక్రమ్ కుమార్ కాంబో మూవీ కూడా గీతా పతాకంపైనే. అలాగే డైరక్టర్ మారుతి తరువాత సినిమా కూడా యువి-గీతా కాంబినేషన్ లోనే.
అంటే మొత్తంమీద సినిమాల నిర్మాణంలో ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించిన గీతాఆర్ట్స్ ఇక మళ్లీ జోరుగా ముందుకు వెళ్లబోతోందన్నమాట.