తెలుగుహీరోల్లో ఎందరు వేసినా, చిరంజీవి మార్క్ డ్యాన్సుల స్పెషాలిటీయే వేరు. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకూ ఆయన స్టెప్పులేస్తే హుషారెత్తిపోవాల్సిందే. ఓ రకంగా సౌతిండియా సినిమాలకే డ్యాన్సులు నేర్పిన హీరో చిరంజీవి అనొచ్చు కూడా. అలాంటి చిరంజీవిని తనకు నచ్చే డ్యాన్సుల గురించి అడిగితే ఏం చెప్పారో తెలుసా? హాయిగా, చూడడానికి పీస్ ఫుల్‌గా ఉండేవే తనకు నచ్చుతాయి అన్నారు. డ్యాన్సుల పేరుతో తెగ ఒళ్లు విరిచేసుకోవడం, విన్యాసాలు చేయడం తనకు నచ్చదంటూ పరోక్షంగా నవతరం హీరోల డ్యాన్సింగ్ స్టైల్‌ని తప్పు బట్టారు.
ఎఎన్నార్ , ఎన్టీయార్ టైమ్‌లో డ్యాన్సులు మితిమీరిన హావభావాల మేళవింపుతో అదో రకంగా ఉండేవి. నిజానికి సినిమా పాటలకు అప్పట్లో డ్యాన్సులు జత చేయడమే కొత్త ట్రెండ్ కాబట్టి… అసలు వాళ్లు కొద్దో గొప్పో డ్యాన్సులు చేయడానికి సిద్ధమవడమే చాలనుకోవాలి. అయినప్పటికీ వాళ్లిద్దరూ తమదైన శైలి డ్యాన్సులను చేసి జనాన్ని ఒప్పించారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబులు కూడా స్టెప్పుల పేరుతో అవస్థలు పడ్డారు. చిరంజీవి వచ్చాకే… సినిమా డ్యాన్సులకు ఒక ఇదమిద్ధమైన రూపం వచ్చింది. అలాంటి చిరంజీవి డ్యాన్సులంటే విన్యాసాలు కాదని స్పష్టం చేయడమంటే…నవతరం హీరోలకు చురకపెట్టినట్టే.
తెలుగులో డ్యాన్సులకు సర్కస్ స్థాయి అందించిన ఆద్యులలో మొదటి హీరో అంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. ఫ్లాష్‌మాబ్ స్టైల్‌లో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక పాటలో బన్నీ కఠినమైన విన్యసాలు గుర్తుండే ఉంటాయి. ఆ తర్వాత హీరోగా వెలుగుతూ కూడా ఆర్య, హ్యీపీ, దేశముదురు.. వగైరా సినిమాలన్నింటిలో బన్నీ బాబోయ్ అనిపించేలా పాటల్లో ఫీట్లు చేశాడు. జూనియర్ ఎన్టీయార్, రామ్‌చరణ్… వీళ్లూ ప్రస్తుతం అదే తరహాలో క్లిష్టమైన ఫీట్లనే డ్యాన్సులుగా మార్చేశారు.
వీరినే ఫాలో అవుతున్న టీనేజ్ యువతీ యువకులు, ఆఖరికి చిన్నపిల్లలు కూడా ప్రస్తుతం టివి రియాలిటీ షోలలో చేస్తున్న డ్యాన్స్ కమ్ ఫీట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. మనకు చిన్నితెరపై గొప్పగా కనపడడానికి వాళ్లు తమ శరీరాలనెంత కష్టపెడుతున్నారో అనిపిస్తుందీ షోలను చూస్తుంటే.. ఈ నేపధ్యంలో… కనువిందుగా ఉండేవే నృత్యాలు తప్ప భయపెట్టే జంపింగ్‌లు, పల్టీలు కావని చిరంజీవి వంటి డ్యాన్సింగ్ సెన్సేషన్ చెబుతున్న విషయం నవతరం అర్ధం చేసుకోవాలి. జగదేక వీరుడు అతిలోక సుందరిలోని అబ్బ నీ తియ్యనీ దెబ్బ పాటలో చిరంజీవి, శ్రీదేవి అలవోకగా వేసిన స్టెప్పులు ఎంత చూడముచ్చటగా ఉంటాయి? ఎన్నో రకాల డ్యాన్సులు చేసినా, అబ్బనీ… పాటకు చేసిన అందమైన మూవ్ మెంట్స్, స్టెప్పులే తనకు నచ్చిన వాటిలో బెస్ట్ అని చిరంజీవి చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం.