త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయకుండానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాదిరిగా దూసుకువచ్చింది దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లోని ఐకాన్ సినిమా. బన్నీకి తెగనచ్చేసిందని, ఫుల్ బౌండ్ స్క్రిప్ట రెడీ అని రకరకాల వార్తలు వినిపించాయి. దాంతో త్రివిక్రమ్ సినిమాను స్పీడప్ చేయాల్సి వచ్చింది. అసలు ఆ సినిమాను స్పీడప్ చేయడానికే ఈ ఐకాన్ హడావుడి అంతా అని కూడా గుసగుసలు వినిపించాయి.
ఇదిలావుంటే త్రివిక్రమ్ తరువాత చేయాల్సిన మైత్రీమూవీస్-సుకుమార్ సినిమా సంగతేంటి? అదెప్పుడు అని అనుమానాలు తలెత్తాయి. మందు ఆ సినిమా చేస్తారని, కాదు ఈ సినిమా చేస్తారని రకరకాల వార్తలు. ఇలాంటి నేపథ్యంలో దసరా టైమ్ లో సుకుమార్ సినిమా ముహుర్తం చేస్తారని, కొంత షూట్ చేసి, ఆ తరువాత ఐకాన్ స్టార్ట్ చేస్తారని, ఇలా రెండూ ఫినిష్ చేస్తారని కూడా వినిపించింది.
అయితే లేటెస్ట్ సమాచారం ఏమిటంటే, ఐకాన్ సినిమాను ప్రస్తుతానికి పక్కనపెట్టారు. ముందుగా మైత్రీమూవీస్-సుకుమార్ సినిమాను ఫినిష్ చేసిన తరువాతే ఐకాన్ సినిమాను స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐకాన్ డైరక్షన్ డిపార్ట్ మెంట్ జనాలకు సమాచారం కూడా అందినట్లు బోగట్టా. సుకుమార్ సినిమా చేసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. అందువల్ల ఇప్పుడు కనుక చేయకపోతే, మరో ఆరేడు నెలలు కూర్చోవాలి.
అందుకే అన్నీ దృష్టిలో వుంచుకుని, సుకుమార్ సినిమానే ముందు స్టార్ట్ చేసి, ఫినిష్ చేయాలని డిసైడ్ అయినట్లు, ఈవిషయం ఐకాన్ నిర్మాత దిల్ రాజుతో కూడా బన్నీ చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సరే అన్నట్లు బోగట్టా. అంతా బాగానే వుంది. కానీ సుకుమార్ సినిమా అయ్యేలోగా మళ్లీ ఎవరైనా డైరక్టర్ వచ్చి, మాంచి ఎగ్జయిటింగ్ సబ్జెక్ట్ చెబితే, అప్పుడు ఐకాన్ పరిస్థితి ఏమిటో?