ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాలు వచ్చేవరకు ఏదైనా అంతా బాగానే వుంటుంది. వివాదాలు వచ్చాకనే ప్రతీదీ వివాదాస్పదమవుతుంటుంది. పవన్‌కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య వ్యక్తిగతంగా విభేదాలు వున్నాయా.? లేవా.? అన్న విషయాలపై చాలాకాలంగా 'గందరగోళం' కన్పిస్తోంది. ఒకప్పుడు బన్నీ డాన్సులంటే తనకు ఇష్టమని పవన్, పవన్‌కళ్యాణ్ తనకు చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో దేవుడి లాంటి వ్యక్తి అని అల్లు అర్జున్ చెప్పుకున్న విషయాల్ని ఎలా మర్చిపోగలం.?
పదే పదే పవనిజం పేరుతో కొందరు అభిమానులు చేస్తున్న 'రచ్చ'ని ఇరిటేషన్‌గా ఫీలయ్యాడు అల్లు అర్జున్. నాగబాబో, చిరంజీవో, రామ్చరణో ఇరిటేట్ అయినా అందులో ఓ అర్థం వుంటుంది. మరీ కామెడీగా అల్లు అర్జున్ ఇరిటేట్ అవడమేంటని, తెగ ఇరిటేట్ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. అంతే, వివాదం ముదిరి పాకాన పడింది. చేసేది లేక, వివరణ ఇచ్చాడు. ఆ వివరణలోనూ పవన్ అభిమానులకి అల్లు అర్జున్ క్లాస్ తీసుకున్నాడు.
పోన్లే, ఎలాగోలా వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం. 'హ్యాపీ బర్త్ డే టూ పవన్ కళ్యాణ్' అంటూ సోషల్ మీడియా ద్వారా సింపుల్‌గా పవన్‌కళ్యాణ్‌కి విషెస్ చెప్పేశాడు అల్లు అర్జున్. మామూలుగా అయితే ఇందులో వివాదం ఏమీ లేదు. 'చెప్పను బ్రదర్..' అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కెలికేసిన అల్లు అర్జున్, ఇప్పుడిలా బర్త్ డే విషెస్ చెప్పడం.. చూస్తోంటే, పవన్ నుంచి అల్లు అర్జున్ ఏదో ఆశిస్తున్నాడంటూ 'కొందరు' అభిమానులు కొత్త వివాదానికి తెరలేపారు.
'హీరోలం అందరం కలిసి మెలిసి వుంటాం.. మా కోసం చచ్చిపోయేంత, చంపుకునేంత అభిమానం మాత్రం పెంచుకోవద్దు..' అంటూ ఈ మధ్యనే ఓ అభిమాని హత్య నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ ఉద్వేగంగా మాట్లాడాడు. కానీ, అభిమానులు హీరోల మాట వింటారా.? పవన్ అభిమానులు వర్సెస్ బన్నీ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా మరోమారు చెలరేగిపోతున్నారు. హీరోల మాటల్ని వింటే, వాళ్ళు అభిమానులు ఎందుకవుతారు.? వాళ్ళ దురభిమానం వారిది.