దేవుడా నీకు దిక్కెవరు.?

హైద్రాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. 11 రోజులపాటు ఉత్సవాలు, ఆ తర్వాత నిమజ్జనం.. ఇదంతా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైద్రాబాద్‌ వచ్చి మరీ గణేష్‌…

హైద్రాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. 11 రోజులపాటు ఉత్సవాలు, ఆ తర్వాత నిమజ్జనం.. ఇదంతా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైద్రాబాద్‌ వచ్చి మరీ గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు ఆసక్తి చూపుతుంటారు. హైద్రాబాద్‌ గణేష్‌ ఉత్సవాల్లో ప్రత్యేకత ఏంటంటే, వివిధ మతాలకు చెందినవారు సైతం గణేష్‌ ఉత్సవాల్లో తమవంతు సహకారం అందిస్తుంటారు. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. హైద్రాబాద్‌తో సమానంగా విశాఖలోనూ, విజయవాడలోనూ అతి పెద్ద విగ్రహాలు సందడి చేస్తున్నాయి. ఉత్సవాల్నీ హైద్రాబాద్‌కి ధీటుగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో 'డూండీ గణేశ సేవా సమితి' ప్రతి యేటా అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం లక్షల్లో ఖర్చు చేస్తోంది. అటూ ఇటూగా కోటి రూపాయలదాకా గణేష్‌ ఉత్సవాల కోసం వెచ్చిస్తున్నారు నిర్వాహకులు. 

దేవుడు.. దేవుడితోపాటే డబ్బు. అవును, దేవుడి చుట్టూ ధన ప్రవాహమే. భక్తి అంటే, ఇప్పుడు ఎలాంటి చీకూ చింతా లేని ఆదాయ మార్గం అయిపోయింది. హైద్రాబాద్‌కి సంబంధించినంతవరకు ఎప్పుడూ ఎక్కడా డబ్బు గురించిన చర్చ జరగలేదు. కానీ, అమరావతిలో అలా కాదు.. డూండీ గణేష్‌ సేవా సమితి గత కొద్ది కాలంగా వివాదాస్పదమవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, కోగంటి సత్యం వర్గాల మధ్య రెండు మూడేళ్ళుగా వివాదం ముదిరి పాకాన పడింది. 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే బొండా ఉమ, గణేష్‌ ఉత్సవాలపై పెత్తనం చెలాయిస్తున్నారన్నది కోగంటి సత్యం ఆరోపణ. తనకింద ఒకప్పుడు బతికిన బొండా ఉమ, ఇప్పుడు తన మీదకే తిరగబడ్డాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, బొండా ఉమ – కోగంటి సత్యంను ఉద్దేశించి 'రౌడీ షీటర్‌' అంటూ విరుచుకుపడ్తున్నారు. ఇక్కడ మేటర్‌ క్లియర్‌. గణేష్‌ ఉత్సవాల పేరుతో అక్కడ దోపిడీ జరుగుతోంది. ఆ దోచుకునే విషయంలోనే వివాదం తలెత్తింది. 

'దోపిడీ' అన్న మాట ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్నదేమీ కాదు, అతి పెద్ద విగ్రహం.. అంటూ డూండీ హడావిడి మొదలెట్టినప్పటినుంచీ వసూళ్ళ చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. విశాఖలోనూ అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హైద్రాబాద్‌లోనూ అంతే. కానీ, విశాఖలో లేని.. హైద్రాబాద్‌లోనూ లేని 'డబ్బు గొడవలు' విజయవాడలోనే ఎందుకు జరుగుతున్నాయి.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. 

పదే పదే అమరావతి పరువు పోతోంది.. అమరావతి పరువు తీసేస్తున్న విపక్షాలు.. అంటూ విరుచుకుపడ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ అమరావతి డూండీ గణేష్‌ వివాదంలో జోక్యం చేసుకోలేరా.? కనీసం పార్టీ పరంగా అయినా బొండా ఉమని కంట్రోల్‌ చేయలేరా.? ఏమోగానీ, ఈ పబ్లిసిటీ చూసి దేవుడెప్పుడో మాయమైపోయాడు. ఎందుకంటే, దేవుడికే దిక్కు లేకుండా పోతోంది చంద్రన్న జమానాలో.