‘కేలండర్ గాళ్’ తెలిసి పోయిందోచ్…

ఇటీవలే ఆగస్టులో విడుదల కానున్న తన కేలండర్ గర్ల్స్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశాడు మధుర్ భండార్కర్. జాతీయ అవార్డ్ విజేత అయిన ఈ దర్శకుడు ట్విట్టర్లో తన సినిమా టీజర్‌ని షేర్ చేశాడు.…

ఇటీవలే ఆగస్టులో విడుదల కానున్న తన కేలండర్ గర్ల్స్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశాడు మధుర్ భండార్కర్. జాతీయ అవార్డ్ విజేత అయిన ఈ దర్శకుడు ట్విట్టర్లో తన సినిమా టీజర్‌ని షేర్ చేశాడు. 5 కొత్త ముఖాలు, 5 కొత్త ప్రయాణాలు, కేలండర్ గాళ్స్ విధితో వారి డేటింగ్ అంటూ… ఈ ఫ్యాషన్ డెరైక్టర్ ట్వీట్ చేశాడు. కాని ఈ టీజర్‌లో సైతం ఆ అమ్మాయిల ముఖాలు ఏ మాత్రం స్పష్టంగా లేవు. 

ఫ్యాషన్‌లో ప్రియాంక చోప్రా, హీరోయిన్‌లో కరీనాకపూర్ వంటి ప్రముఖ నటీమణులతో మాత్రమే చేసిన భండార్కర్… ఈ సారి ఐదుగురు కొత్త అమ్మాయిలను రంగంలోకి దించడం ఆసక్తి రేపింది. ప్రముఖ కేలండర్స్‌లో కనిపించిన తర్వాత వచ్చే పాప్యులారిటీ, దానివల్ల మోడల్స్ జీవితాలు ఎలా మారతాయి అనే అంశం చుట్టూ కధ అల్లుకున్న చిత్రమిది. 

ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తప్ప అందులో ఎవరు నటిస్తున్నారో, ఎక్కడ, ఏం తీస్తున్నారో బయటకు ఏమాత్రం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి సెక్యూరిటీ మధ్య ముంబయితో పాటు విదేశాల్లోని ఖరీదైన లొకేషన్లలో చిత్రం షూటింగ్ చేశారు. అపరిచితులు ఎవరినీ షూటింగ్ సెట్‌లలోనికి రానివ్వలేదు. కెమెరాలు సరే ఆఖరికి మొబైల్ ఫోన్స్ తేవడానికి కూడా అనుమతించలేదు. హీరోయిన్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం  లీక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

దీని కోసం మంగళ్ మూర్తి ఫిలిమ్స్ బేనర్‌పై దీనిని రూపొందిస్తున్న నిర్మాత  సంగీతా అహిర్ ముందు జాగ్రత్తగా సినిమా టీమ్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సీక్రెసీని సమర్ధించుకుంటూ ‘‘ఈ సినిమాలో అమ్మాయిలు అందరూ కొత్తవారు. వీరి గురించి సరైన సమయంలో వెల్లడించాలనుకున్నాం. ఇదంతా మార్కెటింగ్ వ్యూహంలో భాగమే’’నన్నారు చిత్ర రూపకర్తలు. 

‘‘మేం అందమైన అమ్మాయిల కోసం వెతికాం. అయితే చిత్ర సన్నివేశాల్లోని గాఢత కారణంగా వాళ్లకు నటన వచ్చి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. లక్కీగా మేం అనుకున్నట్టుగానే అటు అందం, ఇటు అభినయ సామర్ధ్యం ఉన్న బ్యూటీస్‌ని సెలెక్ట్ చేయగలిగాం’’అంటూ ఆనందం వ్యక్తం చేశాడు మధుర్ భండార్కర్.

 ఐదుగురిలో ఒకరు మన దక్షిణాది అమ్మాయే…

 ఇదిలా ఉంటే… ఇలా ఊరించి ఊరించి ఆగస్టులో ఒకేసారి ఆ 5గురి గురించి వెళ్లడించాలనే మధుర్ వ్యూహానికి గండి పడ్డట్టే ఉంది. మీడియా పుణ్యమాని అందులో ఒకరిద్దరి గురించి బయటి ప్రపంచానికి వెల్లడైపోయింది. కేలండర్ గాళ్స్‌లో నటిస్తున్న 5గురిలో ఒకరు ఆకాంక్ష పూరి అని ఓ ఇంగ్లీష్‌డైలీ సీక్రెట్ బయటపెట్టింది. 

పాండ్యన్, ప్రైజ్ ది లార్డ్, సామ్రాజ్యం 2, సన్నాఫ్ అలెగ్జాండర్ వంటి సినిమాల్లో నటించిన ఈ పొడగరి హీరోయిన్ ఈ సినిమాలేవీ పెద్దగా ఆడకపోయినా… మధుర్ భండార్కర్ మూవీలో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.  ఇందులో ఉన్న మరో హీరోయిన్… గతంలో కింగ్‌ఫిషర్ మోడల్‌గా పనిచేసి, త్రిబుల్ ఎక్స్ హిందీ సినిమాలో నటించిన  కైరాదత్ అని కూడా తేలిపోయింది. ఇక మిగిలిన ముగ్గురూ ఎవరో కూడా సినిమా విడుదలయ్యే లోగా కనిపెట్టగలరేమో చూడాలి…

 -ఎస్బీ.