సాధారణంగా నటుల స్థాయిని బట్టి షూటింగ్ స్పాట్ లో కేరవాన్ లు నిర్మాతలే ఏర్పాటు చేస్తారు. రాను రాను అది ఎలా మారింది అంటే ఔట్ డోర్ లో కాదు, స్టూడియోల్లో షూటింగ్ అయినా కేరవాన్ లు పెట్టాల్సి వస్తోంది. అయితే మన హీరోలు కొంతమందికి స్వంత కేరవాన్ లు వున్నాయి. పెద్ద హీరోలు వారి వారి అభిరుచికి అనుగుణంగా కేరవాన్ లు తయారుచేయించుకున్నారు.
ఇలా కేరవాన్ లు వున్న పెద్ద హీరోలు ఇక నిర్మాతను కేరవాన్ కావాలని అడగరు. వారి స్వంత వాహనాల్లోనే వచ్చి వెళ్తారు. అయితే అలా అని బయట కేరవాన్ లకు ఇచ్చే డబ్బు ఏదో తమకే ఇవ్వమని ఏ హీరో అడగరు.
కానీ ఒకే ఒక్క హీరోకి మినహాయింపు అంట. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా చెప్పుకునే ఓ టాప్ హీరో కు మాంచి కేరవాన్ వుంది. అందులో సకల సదుపాయాలు వున్నాయి. అన్నీ చూసుకుని అలా డిజైన్ చేయించుకున్నారు ఆ హీరో.
అయితే ఈ కేరవాన్ ను సినిమాల షూటింగ్ లకు వాడినపుడు మాత్రం నిర్మొహమాటంగా నిర్మాతల దగ్గర నుంచి ముందుగా ఫిక్స్ చేసిన రెంట్, ఇతర ఖర్చులు వసూలు చేసేస్తారట. ఆయన ఆ కేరవాన్ ను ఆరేళ్ల క్రితం కొనుగోలు చేసారు. ఈ ఆరేళ్లలో నాలుగు సినిమాలు చేసారు. ఒక్కో సినిమాకు కనీసం 60రోజులు కాల్ షీట్లు ఇచ్చినా, అందులో 40రోజలు కేరవాన్ వాడి వుంటారనుకున్నా, 160రోజల అద్దె రూపంలో కేరవాన్ కు కొంత డబ్బులు వెనక్కు వచ్చాయన్నమాట.
అయిదువేలు చూసుకున్నా, కేరవాన్ ఖర్చులో ఎనిమిది లక్షలు వెనక్కు వచ్చి వుంటాయి. సరే, డ్రయివర్ జీతాలు, డీజిల్ ఖర్చు ఎలాగూ నిర్మాతలే భరిస్తారు. సినిమా షూట్ ఉన్నపుడు హీరో, హీరోయిన్ల పర్సనల్ స్టాఫ్ జీతాలు నిర్మాత ఖాతాలోనే కదా? నిజానికి ఆ హీరో తీసుకునే రెమ్యూనిరేషన్ తో చూసుకుంటే ఈ ఎనిమిది పదిలక్షలు పీనట్స్ కింద లెక్క. అయినా వాటిని కూడా వదలకపోవడం అంటే ఏమనుకోవాలి?