చాంబర్ డిస్కషన్ కు ‘భరత్’ రెడీయేనా?

భరత్ అనే నేను, నా పేరు సూర్య విడుదల తేదీల పీట ముడి బిగిసింది. వ్యవహారం నిర్మాతల చేతుల్లోంచి హీరోల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా స్మూత్ గా…

భరత్ అనే నేను, నా పేరు సూర్య విడుదల తేదీల పీట ముడి బిగిసింది. వ్యవహారం నిర్మాతల చేతుల్లోంచి హీరోల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా స్మూత్ గా పరిష్కరించాలా? అని కిందా మీదా అవుతున్నారు.

మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో పాటు, భరత్ అనే నేను సినిమాను నిర్మాత దానయ్య తరపున నైజాంలో కేవలం పంపిణీ చేసి పెట్టడానికి ఒప్పుకున్న దిల్ రాజు మద్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ తప్పు మహేష్ నిర్మాతల వైపే కనిపిస్తోంది.

ఎందుకంటే బన్నీ యూనిట్ ముందుగానే ఏప్రియల్ 27అని డేట్ ఇచ్చింది. ఆ తరువాత మహేష్ యూనిట్ కూడా అదే డేట్ ప్రకటించింది. ఈలోగా కాలా రావడంతో గడచిన మూడు నాలుగు రోజులుగా బన్నీ యూనిట్ బయ్యర్లతో డిస్కనన్లు సాగించి ఒక రోజు ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ప్రకటించిన నాలుగు గంటల తరవాత భరత్ యూనిట్ కూడా 26అని ప్రకటించింది. దీంతో ముడి బిగిసుకున్నట్లు అయింది.

ఇప్పుడు కావాలంటే మరో వారం రోజులు ముందుకు వెళ్లడానికి కూడా బన్నీ నా పేరు సూర్య యూనిట్ రెడీ గా వుంది. రామ్ చరణ్ సినిమా మార్చి నెలాఖరులో విడుదలవుతోంది. ఆ సినిమాకు 15రోజులు గ్యాప్ ఇచ్చి ఏప్రియల్ సెకెండ్ వీక్ లో వేయడానికైనా రెడీ అంటోంది. కాదు అంటే ఏప్రియల్ 20న వేయడానికి రెడీ అంటోంది. కానీ ఇప్పుడు అలా డేట్ ప్రకటిస్తే, మళ్లీ భరత్ డేట్ మార్చుకుని ముందుకు రాదని గ్యారంటీ వుందా? అని నా పేరు సూర్య యూనిట్ నుంచి ప్రశ్న ఎదురవుతోంది.

అందుకే ఈ సమస్య ను చాంబర్  పెద్దల ముందే పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో నా పేరు సూర్య యూనిట్ వైఖరి క్లియర్ గా వుంది. కానీ భరత్ అనే నేను యూనిట్ మాత్రం, మహేష్ బాబుకు మే నెల అచ్చిరాదు కాబట్టి, ఎలాగైనా నా పేరు సూర్య సినిమాను మేకు నెట్టి, ఏప్రియల్ లో సోలో విడుదల సాధించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు కావాలంటే వెళ్తాం కానీ, వెనక్కు వెళ్లేది లేదని నా పేరు సూర్య యూనిట్ అంటోంది. ఇలా ముందుకు వెళ్తే, భరత్ అనే నేను సినిమాకు సి సెంటర్లలోని సింగిల్ థియేటర్ల దగ్గర సమస్య వస్తుంది. అందుకే వెనక్కు నెట్టాలని చూస్తున్నారు. కానీ దీనికి బన్నీ నిర్మాతలు ససే మిరా అంటున్నారు.

అందువల్ల చాంబర్ పెద్దలు కూర్చుని, ఇరు పక్షాలు ఎప్పుడు ఎప్పుడు ఏం ప్రకటించాయి. ఎవరు ఎప్పుడు వస్తామని, ఎప్పటికి చేరారు ఇలాంటివి అన్నీ డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే, ఆ డెసిషన్ కు తాము కట్టుబడి వుంటామనే ఫీలర్లను నా పేరు సూర్య యూనిట్ వినిపిస్తోంది.

ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే, నాపేరు సూర్య సినిమా రెండు పాటలు మినహా అంతా రెడీ అయిపోయింది. మార్చి ఫస్ట్ వీక్ లో షూట్ పార్ట్ పూర్తయిపోతుంది. కానీ భరత్ అనే నేను షూట్ పార్ట్ మార్చి మూడో వారం వరకు వుందని తెలుస్తోంది. అందువల్ల షూటింగ్ పూర్తయిన తాము వెనక్కు వెళ్లడం ఏమిటి? అన్నది బన్నీ సినిమా నిర్మాతల వాదన.

మహేష్ తో సినిమా చేస్తుండడంతో దిల్ రాజు, మహేష్ తో సినిమా చేసి, మరో సినిమా చేయాలని వున్న ఎన్వీ ప్రసాద్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. వాళ్లే సినిమాను ఎక్కువగా పంపిణీ చేయాల్సింది. దీంతో ముడి బిగిసుకుపోతోంది.