రాజకీయ నాయకులు, పాలకులు ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల గిమ్మిక్స్ చేస్తుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ఉచిత పథకాలు, ఆకర్షణీయమైన స్కీములు ప్రవేశపెట్టి ప్రజల జీవితాలను బ్రహ్మాండంగా మార్చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసి పూర్తి చేసినట్లు బిల్డప్ ఇస్తుంది.
ఈ కాలంలో ప్రతి పార్టీకి సొంత మీడియా ఉంది. అది లేకపోతే భజన చేసే మీడియా ఉంది. కాబట్టి ప్రచారానికి కొదవ ఉండదు. అధికార పార్టీ సహా పలు పార్టీలు చేసే మరో పని ప్రజల్లో సెంటిమెంట్లు వ్యాప్తి చేయడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ, భాషా ద్వేషాలను పురిగొల్పడం మొదలైనవి. తెలంగాణ ఉద్యమంలో చేసింది ఈ పనే కదా.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కూడా చాలా కాలం తెలంగాణ సెంటిమెంటును పెంచి పోషించారు. ఇందుకు భాషను, పండుగలను పబ్బాలను వాడుకుంటున్నారు. ఇందుకోసం ప్రజాధనం కోట్లు ఖర్చు చేస్తున్నారు. టీడీపీని ఆంధ్రా పార్టీగా ప్రచారం చేసి చివరకు అనైతిక ఫిరాయింపులతో ఉనికి కోల్పోయేలా చేశారు.
చాలాకాలం ఆంధ్రాను తిట్టి పబ్బం గడుపుకున్నారు. బంగారు తెలంగాణ అంటూ ఆయన ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా వైఫల్యాలు కనబడుతూనే ఉన్నాయి. గొప్పగా ప్రచారం చేసుకున్న కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. ఇది ఎన్నికల ఏడాది కావడం, రాజకీయాలు వేడెక్కుతుండటంతో టీఆర్ఎస్ ప్రజల్లో మళ్లీ సెంటిమెంటు బీజాలు నాటాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతోంది.
ఇంతకూ కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఆయన ఓ పెద్ద పథకం చేపట్టారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, దర్శనీయ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు…వగైరా సమస్త వివరాలతో 100పేజీల పుస్తకం (బుక్లెట్) తయారుచేయించారు. దీన్ని రాష్ట్ర విద్యా మండలి, పరిశోధన, శిక్షణ సంస్థ రూపొందించింది.
ఈ బుక్లెట్ను రెండున్నర కోట్ల కాపీలు ప్రచురించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తారు. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకూ పంపుతారు. ప్రభుత్వం చేయించిన సర్వే ప్రకారం రాఫ్ట్రంలో కోటీ 30లక్షల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలన్నింటికీ రాబోయే ఉగాదినాడు తెలంగాణ చరిత్ర పుస్తకాలు అందించాలని సర్కారు ప్లాన్. ఈ పుస్తకానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తిరిగి రాగానే పుస్తకం పేరు నిర్ణయమవుతుంది. రాష్ట్రంలో, ప్రధానంగా రాజధానిలో తెలంగాణ చరిత్ర, , ఉద్యమం, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, ఆలయాలు మొదలైనవాటిపై కుప్పలు తెప్పలుగా పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షలకు ఈ అంశాల మీదనే ప్రధానంగా ప్రశ్నలు ఉండటంతో బాగా అమ్ముడుపోతున్నాయి. అయినప్పటికీ సర్కారు ప్రత్యేకంగా పుస్తకం రూపొందించి పంపిణీ చేయడమెందుకు? ఇదో రకమైన సెంటిమెంటు వ్యాప్తి చేయడం అనుకోవచ్చా?