తొలి ప్రేమ సినిమా మంచి హిట్ గా నిలుస్తోంది. నిజానికి ఇటు తొలిప్రేమ అటు ఇంటిలిజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లకు మెగాస్టార్ చిరంజీవి వస్తారేమో అనుకన్నారు. ఎందుకంటే అంతకు ముందే నాగశౌర్య ఛలో ఫంక్షన్ కు చిరు వెళ్లారు. అందువల్ల ఈ పంక్షన్లకు కూడా వస్తారని అనుకున్నారు. కానీ ఈ రెండు ఫంక్షన్లు వేరే వేరే ఊళ్లలో జరగడంతో మెగాస్టార్ కు వీలు కాలేదు.
కట్ చేస్తే ఇంటిలిజెంట్ వీర ఫ్లాప్ గా మిగిల్తే, తొలి ప్రేమకు అన్ని వైపుల నుంచి మాంచి అప్లాజ్ వస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తొలి ప్రేమ సినిమాను, ఆ సినిమా యూనిట్ ను అభినందించాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఈ శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా మీడియా మీట్ ను ఏర్పాటు చేసారు.
మీడియా మీట్ తొలి ప్రేమ కోసం అని చెప్పలేదు. కానీ, విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, అందుకోసమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ మొదట్నించీ వరుణ్ తేజ్ కు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఫిదా సినిమాను వరుణ్ దగ్గరకు పంపించిందే రామ్ చరణ్.
ఈ నేపథ్యంలో మెగా సపోర్ట్ కూడా వరుణ్ కు దొరకబోతోంది. శుక్రవారం నాటికి తొలిప్రేమ విడుదలై వారం అవుతుంది. అదే రోజు మెగా ప్రశంసలు కురిపిస్తే, మళ్లీ కలెక్షన్లు కాస్త పుంజుకుంటాయి.