నలుపు రంగును మనం అశుభ సూచకంగా భావిస్తాం. కానీ ‘‘నలుపు నారాయణుడు మెచ్చు..’’ అంటూ కృష్ణ పరమాత్ముడు కూడా నల్లటివాడే అని సర్ది చెప్పుకుంటూ నల్లగా ఉండేవాళ్లలో ఆత్మన్యూనత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కానీ… ద్రవిడులు అంటే నల్లోళ్లని.. నలుపు ద్రవిడుల ఆత్మగౌరవానికి చిహ్నం అని హీరో కమల్ హాసన్ అంటున్నారు మరి.
అందుకే తన పార్టీకి నలుపు రంగు పూసేశానని సెలవిస్తున్నాడు. తన పార్టీకి నలుపు రంగు ఎంచుకోవడం సంగతేమో గానీ.. ఇక్కడ తమిళనాడులో రాజ్యం చేస్తున్న అన్నా డీఎంకేకు గానీ, కేంద్రంలో పాలిస్తున్న భాజపాకు గానీ.. ఇప్పటికే కమల్ ఎడాపెడా నలుపు రంగు పులిమేసిన సంగతి అందరికీ తెలుసు.
ఇప్పుడు ద్రవిడుల రంగే నలుపు అని హీరోగారు సెలవిస్తున్నారు. అదేం చిత్రమో.. తమిళనాడులోని చాలా పార్టీలు నలుపు రంగుకు తెగ ప్రయారిటీ ఇస్తుంటాయి. వారందరి కాన్సెప్టు కూడా ఇదే కాబోలు.
ఇన్నాళ్లుగా మన దేశంలో ఉత్తరాది వారికి దక్షిణాదివారంటే వివక్ష అని విపరీతంగా ఆరోపణలున్నాయి. అలాగే జాతి వివక్ష కూడా మన దేశంలో ఎక్కువే. అంతే తప్ప అమెరికాలో మాదిరిగా వర్ణ వివక్ష మనకు ఉండదు. కాకపోతే.. ఇప్పుడు ద్రవిడులంతా నల్లటివాళ్లు.. నలుపు రంగు ద్రవిడుల సొత్తు అని కమల్ హాసన్ సూత్రీకరించేస్తుండడం వల్ల.. దేశంలో రంగుల పరంగా కూడా ఒక స్పష్టమైన విభజన వచ్చేస్తుందేమో. అంటే.. ఉత్తరాది వాళ్లంతా తెల్లోళ్లు అని, దక్షిణాది వాళ్లు.. ద్రవిడులంతా నల్లోళ్లు అని సిద్ధాంతాలు పుట్టొచ్చు.
అంటే ఇక మీదట ఉత్తరాది నుంచి వచ్చి హస్తినాపురంలో రాజ్యం చేస్తున్న వాళ్లు మనల్ని చిన్నచూపు చూశారంటే గనుక.. వర్ణ వివక్ష ముదురుతున్నదని.. నల్లోళ్లంటే చులకన అయిపోయిందని మనం కూడా గోల చేయవచ్చునన్నమాట. ఆ రకంగా మన దేశంలో కూడా రంగుల గోల మొదలవుతూ ఉందన్నమాట.
కమల్ పుణ్యమాని.. మనకు కూడా వర్ణ వివక్ష మీద అవగామన పెరుగుతుంది. కమల్ తన పార్టీ గుర్తు నలుపు గనుక.. ప్రత్యర్థులందరి మీద నలుపు రంగు చల్లితే.. బాగుంటుంది గానీ.. ప్రజలను చీకట్లో ఉంచేయకుండా వెలుతురు వైపు నడిపిస్తే ఇంకా బాగుంటుంది.