చాంబర్ ప్రమేయం ఎందుకోసం? ఎవరి కోసం?

దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కొర్రపాటి లాంటి బడా పంపిణీ దారులు ఇన్ వాల్వ్ అయి వున్నారు రుద్రమదేవి విషయంలో. ఇదే ఇప్పుడు రుద్రమదేవిని వెనక్కు నెట్టాలని కొందరు చూడడానికి కారణం అవుతోందా…

దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కొర్రపాటి లాంటి బడా పంపిణీ దారులు ఇన్ వాల్వ్ అయి వున్నారు రుద్రమదేవి విషయంలో. ఇదే ఇప్పుడు రుద్రమదేవిని వెనక్కు నెట్టాలని కొందరు చూడడానికి కారణం అవుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆర్థిక సమస్యలను అధిగమించి, రుద్రమదేవి విడుదలైతే, చాలా సినిమాలు ఇరుకునపడతాయి. వాయిదా పడి వాయిదా పడి, రుద్రమదేవి ఫిక్స్ చేసుకున్న అక్టోబర్ 9వ తేదీ చాలా కీలకం అయిపోయింది. దాని ముందుగా వస్తున్న స్రవంతి రవికిషోర్ శివమ్ సినిమాకు వారం మాత్రమే కాస్త మార్కెట్ దొరుకుంది. కాస్త అని ఎందుకు అనడం అంటే, అటు పులి సినిమాతో షేర్ చేసుకోవాలి కాబట్టి. 

రుద్రమదేవి వెనుకవచ్చేవాటికి థియేటర్ల సమస్య ఎదురవుతుంది.  ముందు విడుదలైన శివమ్ కు థియేటర్ల సమస్య రాదు కానీ, బ్రూస్ లీ సినిమాకు, అఖిల్ సినిమాకు ఈ సమస్య తప్పదు. సినిమా హిట్ అయినా కాకున్నా కూడా థియేటర్లు ఖాళీ కావు. అందువల్ల మరో మార్గం లేదు..రుద్రమదేవిని ఆపడం తప్పించి. అందుకే చాంబర్ లో రుద్రమదేవిని వాయిదా వేయమని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఒక్క సినిమా వల్ల మిగిలినవన్నీ ఇబ్బంది పడతాయి కాబట్టి, ఆ పాయింట్ బేస్ చేసుకుని వాయిదా అడిగారు. కానీ 70 కోట్ల సినిమా, అది కూడా అనేక ఇబ్బందులు పడి పూర్తయిన సినిమా, ఇప్పుడు కాకుంటే మరి చాలా ప్రమాదంలో చిక్కుకునే సినిమా అన్న పాయింట్లను మాత్రం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారు.

దిల్ రాజు, సురేష్, గీతా, ఎన్వీప్రసాద్, సాయి కొర్రపాటి, ఆశియన్ సునీల్ కలిస్తే దాదాపు రాష్ట్రంలో థియేటర్లు 95శాతం కవర్ అయిపోతాయి. వీళ్లలో కీలకమైన ముగ్గురు అంటే దిల్ రాజు, అరవింద్, సాయి కొర్రపాటి/ఎన్వీప్రసాద్ రుద్రమదేవి పంపిణీలో వున్నారు. అందువల్ల వాళ్ల థియేటర్లను రుద్రమదేవికి కాకుండా వేరేవాళ్లకు ఇచ్చే పరిస్థితి వుండదు. కానీ ఇప్పుడు వాళ్లకు కూడా వివిధ మార్గాల్లో ఆబ్లిగేషన్లు తప్పడం లేదు.  

రుద్రమదేవి వల్ల ఇబ్బందిపడే సినిమాలు రెండింటిలో ఒకదానికి  సుధాకర రెడ్డి తనయుడు హీరో నితిన్ నిర్మాతగా వ్వవహరిస్తున్నారు. తెలంగాణలో తమకు కౌంటర్ పార్ట్ అయిన సుధాకర రెడ్డికి దిల్ రాజు సహకరించాలి. సీడెడ్ లో ఎన్వీ ప్రసాద్ (సాయి కొర్రపాటి భాగస్వామి) సహకరించడానికి అవకాశం వుంది. ఎందుకంటే ఆయన తన తరువాతి సినిమా రామ్ చరణ్ తోనే చేస్తున్నారు కాబట్టి. ఇక గీతా సంస్థ అధినేత అరవింద్ కు రామ్ చరణ్ మేనల్లుడేగా. 

సో రుద్రమదేవి విడుదల అన్నది వీళ్లకు కూడా సమస్యే. ఇటు ఆబ్లిగేషన్లు చూడాలి..అటు తమ డబ్బులు తమకు వెనక్కురావాలి. అందువల్ల అదే కనుక రుద్రమదేవి వెనక్కు వెళ్తే ఏ సమస్యా వుండదు. అందుకే వాళ్లు మౌనం వహించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు సమస్య అంతా నిర్మాత కమ్ గుణశేఖర్ దే. ఈ సీజన్ వదులుకుంటే మళ్లీ రాదు. అందుకనే ఆయన ఎలాగైనా విడుదల చేయాలని పట్టుదలగా వున్నారు. 

కానీ టాలీవున్ మహా మహా జనాలు, వాళ్ల నడుమ కనిపించకుండా నడిచే రాజకీయాలు, సినిమా జనాల మధ్య వున్న రకరకాల ఈక్వేషన్లు, వీటన్నింటి కూడికలు తీసివేతలు, వెరసి జరిగే నిర్ణయాలు..వీటిని గుణశేఖర్ లాంటి నిర్మాణంలోకి తొలిసారి దిగిన దర్శకుడు తట్టుకోగలడా? కాస్త సందేహమే.