భారతదేశంలో పుట్టి సాంకేతిక ప్రపంచంలో విజేతగా నిలిచి అగ్రస్థాయి కంపెనీకి నాయకుడైన సత్యనాదెళ్ల… కన్నభూమి రుణం తీర్చుకునేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్లో మైక్రోసాఫ్ట్ కూడా పాలు పంచుకుంటుందని ఆ సంస్థ సిఇఒ సత్యనాదెళ్ల ప్రకటించారు. అమెరికాలో మన ప్రధాని మోడీతో విందు సమావేశం సందర్భంగా ఆదివారం ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
భారతదేశంలోని 5లక్షల గ్రామాలకు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని తక్కువ వ్యయానికే ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ సహకరిస్తుందని వివరించారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలలో పాలు పంచుకుని ప్రపంచస్థాయి మౌలిక వసతులను భారత్కు చేర్చేందుకు తమ సేవలను వినియోగించడం అనేది తమ సంస్థ ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి వంటిదన్నారాయన. దీనిలో భాగంగా మరికొన్ని సాంకేతిక సేవలను సైతం చవక ధరలకు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
దేశంలోని లక్షలాది గ్రామాలను సాంకేతికంగా పరిపుష్టం చేసే పనిలో సహకరించేందుకు ఒక విదేశీ సంస్థ ముందుకు వచ్చిన తరుణంలో ఆ సంస్థకు ఒక భారతీయుడే నాయకుడిగా ఉండడం మనకు తప్పనిసరిగా ఉపయుక్తమైన విషయం అనడంలో సందేహం లేదు. మైక్రోసాఫ్ట్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ సత్యనాదెళ్లకు శుభాకాంక్షలు అందిద్దాం.