Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చానెళ్ల బహిష్కరణ.. సాధ్యమేనా?

చానెళ్ల బహిష్కరణ.. సాధ్యమేనా?

నచ్చినన్నాళ్లు రాసుకున్నారు.. పూసుకున్నారు. చానెళ్ల గుమ్మాల్లోకి వెళ్లి మరీ ఇంటర్వూలు ఇచ్చారు. వాళ్లు చేసే పిచ్చి పిచ్చి గేమ్ షోల్లో కూడా పాల్గొని, వాళ్లు గెంతమన్నట్లు గెంతారు. ఆడమన్నట్లు ఆడారు. పాడమన్నట్లు పాడారు. ఇప్పుడు న్యూస్ చానెళ్లు వద్దు. ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు ముద్దు అంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా?

నిజానికి సినిమాలకు ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు ఇచ్చే ప్రచారం న్యూస్ చానెళ్లు ఇవ్వలేవు. ఇది వాస్తవుం. ఎందుకంటే సినిమాలకు ప్రేక్షకులయిన మహిళలలో నూటికి తొంభైశాతం మంది చూసేది జీ, మా, జెమిని, ఈటీవీ లాంటి ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లే తప్ప న్యూస్ చానెళ్లు కావు. కేవలం మగవాళ్లు, యూత్ మాత్రమే న్యూస్ చానెళ్లకు ఎక్కువగా ప్రేక్షకులు. అయితే న్యూస్ చానెళ్లకు కూడా క్రేజ్ తీసుకురావడం కోసం సినిమా కంటెంట్ కోసం, సినిమా డిస్కషన్ల కోసం, సినిమా గ్లామర్ అద్దకం కోసం తహతహలాడుతున్నది వాస్తవం.

ప్రైమ్ టైమ్ లో సినిమా జనాలను తీసుకువచ్చి, న్యూస్ రూమ్ లో కూర్చోపెట్టడం, ఏదో ఒక వంక దొరికితే చాలు, సినిమాల మీద డిస్కషన్లు పెట్టడం ఇవన్నీ కేవలం చానెళ్లు తమ టీఆర్పీ పెంచుకోవడం కోసం తప్ప వేరు కాదు.

పైగా ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల ప్రకటన రేట్లు వేరు. న్యూస్ చానెళ్ల ప్రకటనల రేట్లు వేరు. ఇండస్ట్రీకి ఏదో మేలు చేస్తున్నట్లు న్యూస్ చానెళ్లు తమ తమ ప్రకటనల రేట్లు తగ్గించి ఇస్తున్నట్లు చూపిస్తున్నారు కానీ, చాలా అంటే చాలా న్యూస్ చానెళ్లకు ప్రకటనలు ఇచ్చేవారే కరువు. గట్టిగా లక్ష రూపాయిలు ఇస్తే చిన్నా చితకకా న్యూస్ చానెళ్లలో వారాల తరబడి ప్రకటనలు వస్తాయి.

ఇలాంటి పరిస్థితి చాలా న్యూస్ చానెళ్లలో వుండగా, పెద్ద చానెళ్ల పరిస్థితి వేరుగా వుంది. ఆడియో ఫంక్షన్ ప్రసారాల కోసం పోటీ పడుతున్నాయి రెండు మూడు చానెళ్లు. వాటికోసం నయానా, భయానా, రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ సినిమా మీద న్యూస్ చానెళ్లు ఏ మేరకు ఆధారపడుతున్నాయన్నది చెప్పడానికే.

ఇక ఇండస్ట్రీ వ్యవహారానికి వస్తే, న్యూస్ చానెళ్లు సినిమా సక్సెస్ కు ఏ మేరకు దోహదపడతాయన్నది పక్కన పెడితే, కింద పడేయడానికి కొంతవరకు పనికి వస్తాయి. గతంలో ఓ ప్రింట్ కమ్ విజువల్ మీడియాకు ప్రకటనలు ఆపేస్తే, రోజుల తరబడి నెగిటివ్ స్టోరీలు వేసి హంగామా చేసారు. సినిమా విడుదల నాడే అస్సలు బాగాలేదని చీల్చి చండాడేసారు. దాంతో ప్రకటనలు ఇవ్వక తప్పలేదు.

దీనికి కారణం, ఆ చానెల్ కు ప్రింట్ మీడియా సపోర్టు వుండడమే. ప్రింట్ మీడియా సపోర్టు లేని చానెళ్లు ఫేస్ బుక్ లను, వాట్సప్ లను ఆశ్రయిస్తున్నాయి. ఫేస్ బుక్ గ్రూపుల్లో, వాట్సప్ గ్రూపుల్లో సినిమా బాగాలేదని, రేటింగ్ 1/5 అని దారుణమైన ప్రచారాలు మొండిగా సాగిస్తున్నారు. దీంతో ఎందుకు వచ్చిన గొడవ అని ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.

నిషేధం అన్నది లేకుండా, కేవలం ప్రకటనలు ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్న దానిమీదే ఇంత హంగామాను చానెళ్లు చేస్తున్నాయి. మరి అలాంటిది, కంటెంట్ ఇవ్వం, ప్రకటనలు ఇవ్వం అంటే, ఇక చానెళ్లు ఓ రేంజ్ లో రెచ్చిపోవడం ఖాయం. రకరకాలుగా సినిమా డ్యామేజ్ కు మార్గాలు చూసుకునే అవకాశం వుంది.

ఉదాహరణకు ఓ పెద్ద సినిమా విడుదలయింది అనుకుందాం. వెంటనే అసలు ఆ సినిమా కంటెంట్ చూపించకుండా, సదురు సినిమా హిట్ నా, ఫట్ నా అని డిస్కషన్ పెటొచ్చు. లాజిక్ లు లేని వైనం చూపించి చీల్చి చెండాడొచ్చు. తెలుగు సినిమాల్లో నూటికి 80కి పైగా పనికిరాని సినిమాలే. ఇలాంటి సినిమాలు అన్నింటినీ ఉతికిపారేయచ్చు.

పైగా మన హీరోలు చెప్పే కబుర్లు ఎక్కువ. చేసేది తక్కువ. స్వచ్చ్ భారత్ కొత్తలో మన హీరోలు చేసిన హడావుడి తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిసిందే. పైగా సినిమా వ్యవహారాల్లో అనేక లొసుగులు, లుకలుకలు వున్నాయి. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ కలిసి సినిమాలను, టాలీవుడ్ ను మరింత కంపు చేస్తాయి.

అందువల్ల మళ్లీ తప్పయిపోయింది అనుకుంటూ మీడియాతో రాజీబాటలోకి రాక తప్పదు. అందువల్ల కంపు చేసుకుని రాజీబాటకు వచ్చే బదులు, ముందే ఆచితూచి వ్యవహరించడం మంచింది. న్యూస్ చానెళ్లకు ఇంటర్వూలు తగ్గించుకోవచ్చు. అస్సలు ఇవ్వడం మానేయకుండా. న్యూస్ చానెళ్లకు ప్రకటనలు ఇవ్వడం తగ్గించుకోవచ్చు. 

ఇలా కర్ర ఒంపు పొయ్యే తీర్చే విధంగా అనేక మార్గాలు వున్నాయి. అవన్నీ వదిలేసి, వివాదాలు దారితీసే నిర్ణయాలు తీసుకోవడం మాత్రం టాలీవుడ్ కు, ముఖ్యంగా నిర్మాతలకు మంచిది కాదు. హీరోలు బాగానే వుంటారు. నిర్మాతలేగా పోయేది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?