గడచిన వారం వరకు వరుసపెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తెగ విడుదలైపోయాయి. ఆ హానీమూన్ ముగిసింది. మళ్లీ సమస్యలు ప్రారంభమయ్యాయి. పండుగల సీజన్ ప్రారంభం అవుతుండడంతో పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. దాంతో చిన్న సినిమాలకు సమస్యలు షురూ అయ్యాయి. 15న సికిందర్ విడుదలవుతోంది. 22న ఖాళీయే కానీ, 29న రభస వస్తుందంటున్నారు.
అందువల్ల 22న విడుదలైనా, సినిమా బాగున్నాకూడా థియేటర్లు వదిలేయాల్సి వస్తుంది. ఇప్పటికే రన్ రాజా రన్ కాస్త ఫిక్సయింది. గీతాంజలి కలెక్షన్లు ఓకె. అల్లుడి శ్రీను సంగతి సరేసరి. ఇలాంటి సమయంలో థియేటర్లు ఎక్కడ సరిపోతాయి. పోనీ రభస తరువాత వేద్దామనుకుంటే రవితేజ పవర్ వస్తోంది.
పోనీ ఆ తరువాత అంటే నాగచైతన్య ఒక లైలా కోసం రెడీ అయిపోతోందని వినికిడి. ఇక ఆ తరువాత దసరా, దీపావళి సందడి ప్రారంభమైపోతుంది. దీంతో చిన్న సినిమాలు కాస్త పక్కన వేచి వుండక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కనీసం నెల రెండునెలలు వేచి వుండాలంటే, లాభాల సంగతి సరే, ముందు వడ్డీభారం తడిసి మోపెడవుతుంది.