ఓ స్థాయికి చేరుకున్న దర్శకులు, నిర్మాతలుగా మారి చిన్న సినిమాలు తీయడం అన్నది మంచి పరిణామం. ఇలా చేయడానికి కూడా కారణం వుంది. వాళ్ల స్థాయి పెరిగిన తరువాత చిన్న సినిమాలు నిర్మించకగలరు కానీ, తీయలేరు. శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు ఇప్పుడు చిన్న సినిమాలు చేద్దామన్నా వీలు కాదు. రాజమౌళి లాంటి వాళ్లు ఈగ లా చిన్న సినిమా సినిమా చేద్దామన్నా అది పెద్ద సినిమా అయి కూర్చుంటుంది. అందువల్ల తమ దగ్గర పనిచేసినవారినో, లేదా సత్తా వుందని తాము భావించిన వారినో దర్శకులుగా అవకాశం కల్పించి, తాము నిర్మాతలుగా మంచి సినిమాలు చేయడం అన్నది హర్షించే పరిణామమే. అయితే ఇలా చేయడం వల్ల అసలు నిజంగా ఆ కొత్త దర్శకుడే చేసాడా..లేక నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడే చేసాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవి అనవసరపు అనుమానాలు, అక్కర్లేని సంగతులు అని కొట్టి పారేయడం వరకు ఓకె. అది సులువే. కానీ నిర్మాతగా వ్యవహరించే దర్శకుడి తీరు కూడా ఇందుకు దారి తీసే ప్రమాదం వుంది. సినిమాకు ఫలానా పెద్ద దర్శకుడు నిర్మాత అని తెలిస్తే, అది ఆ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. అందువల్ల ఆ పేరు ప్రామినెంట్ గా వాడుకొక తప్పదు. మరోపక్క అలా ప్రామినెంట్ గా వాడాలంటే, సదరు నిర్మాత కమ్ దర్శకుడు ఆ సినిమా ఫంక్షన్లలో కనిపించకతప్పదు. కనిపిస్తే ఇలాంటి రూమర్లు.
చిత్రంగా తెలుగునాట ఇటువంటి నిర్మాణ వ్యవహారాలకు శ్రీకారం చుట్టింది దర్ళకుడు మారుతి. సినిమా నిర్మాణంపై ఆయనకున్న అవగాహన,. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఇవ్వగల ఐడియాలు వుండడంతో ఆ దిశగా అడుగులు వేసారు. కానీ ప్రేమకథాచిత్రమ్ తో ఈ దర్శకుడి వైనం లో వార్తలకు కేంద్ర బిందువయ్యారు. ఆఖరికి తానే దర్శకుడనని, కొన్ని పరిస్థితుల వల్ల వేరే వారి పేరు వేసానని అంగీకరించారు. ఆ తరవాత మళ్లీ అలాంటి రూమర్లు రాలేదు కానీ, ఇప్పుడ మళ్లీ లవర్స్ విషయంలో వినిపించాయి. ఈ సినిమాకు మారుతినే మాటలు అందించడం విశేషం. పైగా ట్రిపుల్ ప్లాటినం డిస్ట్ ఫంక్షన్ లో మాట్లాడుతున్నపుడు, సీన్లు ఎన్నయినా చకచకా చేసేసాడు సుమంత్ అశ్విన్ అంటూ తానే దర్ళకుడా? అన్న అనుమానం వచ్చేలా మాట్లాడారు. ఇలాంటి వాటి వల్లే రూమర్లు పుడతాయి. ఈ విషయమే మారుతి దగ్గర ప్రస్తావిస్తే, ఈ సినిమాకు తాను మాటలు మాత్రమే అందించానని, సలహాలు సూచనలు మామూలేనని అన్నారు. ఇలాంటి కాంట్రావర్సీలు ఎందుకు..మీ సినిమాలు మీరే చేయచ్చుగా అని ప్రశ్నిస్తే, గతంలో ఒప్పుకున్న ఒకటి రెండు మిగిలాయని, ఆ తరువాత ఇక వుండవని అన్నారు.
కానీ, సమస్యకు ఇది పరిష్కారం కాదు కదా..మారుతి నిర్మాతగా వుండాలి. సరైన వారికి అవకాశాలు కల్పించి మంచి సినిమాలు అందించాలి. అలాగే ఇలాంటి రూమర్లు రాకూడదనుకున్నపుడు చాలా స్పష్టంగా ఆయన మీడియాకు చెప్పేయాలి..తన ప్రమేయం లేదని. పైగా ఇది ఆయనకు అడ్వాంటేజ్ కూడా. గతంలో మారుతి సమర్పణలో వచ్చిన కొన్ని సినిమాల మైనస్ కూడా ఆయన వద్దన్నా, ఆయన ఖాతాలోనే వేసారు. ఆ సమస్య తప్పుతుంది.
ఏదైనా పెద్ద దర్శకులు చిన్న సినిమాలు నిర్మించి, కొందర్నయినా ప్రోత్సహించడం అవసరం.