సరిలేరు నీకెవ్వరు సినిమాతో పెద్ద డైరక్టర్ల జాబితాలోకి పూర్తిగా చేరిపోయారు డైరక్టర్ అనిల్ రావిపూడి. కానీ మళ్లీ చేతిలో సినిమా లేదు. కారణం కరోనా. వెంకీ, వరుణ్ తేజ్ ఫ్రీ అయితే తప్ప ఎఫ్ 3 ప్రారంభం కాదు.
అంత వరకు ఖాళీనే. అందుకే ఈ లోగా ఓ చిన్న సినిమాకు కథ అందించే పనిలో పడ్డారు. కేవలం కథ అందించడమే కాదు, నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారని బోగట్టా.
విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి మిత్రుడు నిర్మాత సాహు గారపాటితో కలిసి ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నారు. శ్రీవిష్ణు హీరో. దీనికి కథను అనిల్ రావిపూడి అందించి, ఆ విధంగా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారు.
సినిమా నిర్మాణం కూడా అనిల్ రావిపూడి మరో మిత్రుడు సాయి పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఆ మధ్య నాగశౌర్య అశ్వద్ధామ సినిమాను డైరక్ట్ చేసిన దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తారు.
అనిల్ రావిపూడి దగ్గర చిన్న సబ్జెక్ట్ లు కొన్ని వున్నాయి. ఇప్పుడు వాటిని ఆయన టేకప్ చేయలేరు. అందుకే ఇప్పుడు ఈ కొత్త మార్గంలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది.