చిరంజీవితో రాజకీయంగా విబేధించిన నాటినుంచీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నాటినుంచీ పవన్‌కళ్యాణ్‌కి ఒక వర్గం మెగా అభిమానులు దూరమయ్యారు. గత ఎన్నికలలో ఫాన్స్ కూడా జనసేనకి ఓట్లు వేయలేదనేది సుస్పష్టం. ఫాన్స్‌ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్న పవన్‌కి వాస్తవం బోధపడినట్టుంది. ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
'సైరా నరసింహారెడ్డి'కి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటుగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ఫాన్స్ జరుపుకునే చిరంజీవి బర్త్‌డే ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా కూడా వెళ్లాడు. చిరంజీవితో సంబంధాలని ఎన్నికలకి ముందే మెరుగు పరచుకున్న పవన్‌కళ్యాణ్ ఇప్పుడు తననుంచి దూరంగా వెళ్లిన అభిమానుల్ని ఆకర్షించే ప్రయత్నాల్లో వున్నాడు.
ఇదిలావుంటే పవన్ మళ్లీ వాయిస్ ఓవర్లు చెప్పడం, సైరాకి ప్రమోషన్లు చేయడం చూసి నెమ్మదిగా సినీ రంగంవైపు అడుగులు వేస్తున్నాడనే టాక్ కూడా మొదలయింది. మళ్లీ సినిమాలు చేయనని పవన్ పలుమార్లు చెబుతున్నా కానీ రాజకీయంగా ఇప్పుడు తాను చేయడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఒక రెండు, మూడేళ్లు సినిమాలు చేసినా తప్పు లేదనే అతని సన్నిహితులు, శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.