అవన్నీ స్వచ్ఛమైన టేకుతో చేయించిన ఫర్నీచర్. వాటిల్లో విదేశాల నుంచి దిగుమతి చేసిన ఫర్నీచర్ కూడా ఉందంటే వాటి విలువ ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం కాదు. అసెంబ్లీ నుంచి నాటి స్పీకర్ హోదాలో కోడెల శివప్రసాదరావు తరలించుకు వెళ్లిన ఫర్నీచర్ విలువ దాదాపు అరవై ఐదు లక్షల రూపాయల వరకూ ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రజాధానంతో అసెంబ్లీకి అంటూ కొనుగోలు చేసిన ఫర్నీచర్ ను అలా కోడెల ఇంటికి తరలించుకున్నారట.
వాటినే తర్వాత కోడెల కుటుంబం ఆధీనంలోని వ్యాపార సంస్థల్లో వాడుకుంటున్నట్టుగా తేలింది. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంకు సంబంధించిన బైక్ షోరూంలో అసెంబ్లీ ఫర్నీచర్ తేలినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. కావాలంటే వాటిని వెనక్కు పంపిస్తానంటూ కోడెల బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా అసెంబ్లీలోని ఫర్నీచర్ నే ఇంటికి తరలించుకున్న కోడెలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ కోడెల అక్రమాలపై బుకాయించిన వారు కూడా ఇప్పుడు కిక్కురుమనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఫర్నీచర్ కోడెల శివరాం బైక్ షోరూంలో ఉందని అధికారులు ధ్రువీకరించారు.
అసెంబ్లీ ఫర్నీచర్ ఆ షోరూంలో ఉందని తేలాకా అక్కడో సోదాలు చేయడానికి అధికారులు వెళ్లగా వారిని కూడా అడ్డించినట్టుగా తెలుస్తోంది. అధికారులు వస్తున్నారని తెలిశాకా అసలు షోరూం తలుపులే మధ్యాహ్నం వరకూ తెరవలేదట. చివరకు తెరిచాకా కూడా సెర్చ్ వారెంట్ ఉందా అంటూ హడావుడి చేశారట. దోపిడీ చేసి, అసెంబ్లీ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి తరలించుకు వెళ్లిన ఫర్నీచర్ ను ప్రైవేట్ గా వాడుకుంటూ.. సోదాలకు వెళ్లిన అధికారులనే దబాయించారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.
అయితే వారిని తప్పించుకుని అధికారులు షోరూంలో పరిశీలించి అక్కడ ఉన్నది అసెంబ్లీ ఫర్నీచరే అని ధ్రువీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు అని చెప్పి ప్రజల సొమ్ముతో ఫర్నీచర్ ను విదేశాల నుంచి తెప్పించి, వాటిని తన ఇంటికి తరలించుకున్నస్పీకర్ గా కోడెల చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాడు. బహుశా దేశంలోనే ఇలాంటి రాజకీయ నేతలు ఇప్పటివరకూ బయటపడలేదు. ఆ వీర కక్కుర్తి కోడెలకే సాధ్యం అయినట్టుందని విశ్లేషకులు అంటున్నారు.