నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవాళ్లతో చాలా వరకు తీసి, బాగాలేదని పక్కనపెట్టి, వేరే హీరోలను ట్రయ్ చేసి ఆఖరికి నాగచైతన్య దగ్గర ఆగారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో కథ సామాజిక వర్గాలు, వాటి వ్యవహారాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
తెలంగాణలో రాజకీయంగా అధికారిక స్థానంలో వున్న ఓ అగ్రవర్ణం, అలాగే ఓ బడుగు వర్గం ప్రతినిధులుగా హీరోయిన్, హీరో కనిపిస్తారని, పల్లెలో అగ్రవర్ణానిది పై చేయి అయితే, పట్నంలో బడుగు వర్గానిది పైచేయి అన్నట్లుగా కథ వుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
శేఖర్ కమ్ముల కేవలం ఈ సామాజిక వర్గ అంశంతో పాటు మరో సామజిక సమస్యను కూడా సినిమాలో డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. కుటుంబంలో సమీప బంధువల లైంగిక హింస అనేది ఇటీవల బర్నింగ్ టాపిక్ గా మారింది. అలాంటిది ఏదో కూడా శేఖర్ కమ్ముల టచ్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది.
మొత్తంమీద శేఖర్ కమ్ముల సినిమా అంటే వైవిధ్యమైన కథతో వుంటుందన్న ఓ నమ్మకం వుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలాగే వున్నాయి రాబోయే సినిమా మీద వినిపిస్తున్న గుసగుసలు.