ఐ సినిమా కు జనాల ఎదురుచూపులు ఎంతలా వున్నాయో, దాని విడుదల టెన్షన్లు అంతలా వున్నాయి. అటు చెన్నయ్ లోనూ, ఇటు హైదరాబాద్ లోనూ మంగళవారం అంతా సినిమాకు సంబంధించిన వారు బిజీబిజీగా వున్నారు. ఫైనాన్షియల్ సెటిల్ మెంట్ లకు సంబంధించి వారు కిందా మీదా పడుతున్నారని తెలిసింది.
మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు ఫైనాన్స్ వ్యవహారాలాపై కిందా మీదా పడినట్లు వినికిడి. అందువల్లనే పివిఆర్ సినిమా, సినీపొలిస్ సంస్థలు సాయంత్రం వరకు తమ ఆన్ లైన్ కౌంటర్లు తెరవలేదు. ఆఖరికి సాయంత్రానికి తెలుగు హక్కుదారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక బుకింగ్ లు ప్రారంభించినట్లు వినికిడి.
ఇదిలా వుంటే తెలుగు వెర్షన్ కు ప్రివ్యూ వేసే పరిస్థితిలో కూడా ఐ సినిమా తెలుగు హక్కుదారులు లేకపోవడం విశేషం. శంకర్ ఏ ప్రివ్యూ వేయవద్దన్నారని వారు అడిగినవారికి చెబుతున్నారట. శంకర్ ఎందుకు అలా చెబుతారని, తెలుగు సినిమా ప్రివ్యూతో శంకర్ కు సంబంధం ఏమిటన్నది సినిమా జనాల ప్రశ్న.
తెలుగు సినిమా హక్కులను 32 కోట్లకు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ చేజిక్కించుకున్నారు. అవి వసూలు అయ్యాక, ఆ పైన ఖర్చలు పోను, మిగిలిన దాంట్లో మళ్లీ ఆస్కార్ సంస్థకు సగం ఇవ్వాలి. ఈ లెక్కన తెలుగు హక్కు దారులు లాభం పొందాలి అంటే కనీసం నలభై కోట్ల వసూళ్లు రాబట్టాలి.
భారీరేట్లు చెప్పడంతో సగానికి పైగా ఏరియాలు అమ్ముడుపోలేదని, దాంతో స్వంతంగా విడుదల చేస్తున్నారని బోగట్టా. గోపాల గోపాల ఏవరేజ్ టాక్ రావడం ఐ అదృష్టం. కానీ బి సి సెంటర్లకు ఏ మాత్రం ఎక్కుతుందన్నది అనుమానం. సినిమా అద్భుతంగా వచ్చిందన్న టాక్ అయితే వుంది. మరి కొన్ని గంటల్లో ఏ విషయమూ తెలిసిపోతుంది.