బోరు బావులు నోళ్ళు తెరిచి చూస్తున్నాయి.. బోర్లు తవ్వేవారు, తవ్వించేవారు ప్రదర్శిస్తోన్న నిర్లక్ష్య వైఖరి, అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరించడం.. పాలకులు కఠినంగా వ్యవహరించకపోవడం.. వెరసి బోరుబావులు చిన్నారుల్ని మింగేస్తూనే వున్నాయి. ఇటీవలే తెలంగాణలో ఓ బాలిక బోరుబావిలో పడటం, రోజుల తరబడి అధికార యంత్రాంగం శ్రమించినా ఆ బాలిక విగత జీవిగానే బయటపడటం తెల్సిన విషయాలే.
తాజాగా మరోమారు బోరుబావిలో చిన్నారి పడ్డ ఘటన తెలంగాణలో జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని పరిగి డివిజన్లోగల గోవింద్ పల్లి తాండాలో ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్ళి బోరుబావిలో పడిపోయింది. బాలిక తల్లిదండ్రులు తమ చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. తమ చిన్నారిని కాపాడాల్సిందిగా బాధిత కుటుంబం అధికార యంత్రాంగానికి మొరపెట్టుకుంటోంది.
బోరు బావిలో చిన్న పిల్లలు పడ్డప్పుడు కోట్లు వెచ్చించి మరీ వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తూ వుంటారు. అసలు బోరు తవ్వినప్పుడే తగిన రక్షణ చర్యలు తీసుకుంటే, ఆ తర్వాత లక్షలు, కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరమే వుండదు. బోరు తవ్వకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అమల్లో వున్నా, వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఏదన్నా ఘటన జరిగిన తర్వాత, ఇకపై అలాంటి ఘటనలు జరగనివ్వబోమనీ, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే పాలకులు, ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. బోరుబావులపై నిర్లక్ష్యమే చిన్నారుల ప్రాణాల్ని బలిగొంటున్నా, పాలకులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం శోచనీయం.