ఒక పక్క కరోనా..మరోపక్క ఆంధ్రలో లోకల్ బాడీ ఎన్నికలు..ఇంకోపక్క టెన్త్ పరీక్షల వాయిదా. ఈ మూడూ ఇఫ్పుడు సినిమాల విడుదల మీద ప్రభావం చూపిస్తాయా? అన్న అనుమానాలు టాలీవుడ్ లో వ్యక్తం అవుతున్నాయి. గత నెలాఖరు నుంచే థియేటర్లలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. భీష్మ సినిమా మెల్లగా కమిషన్ల కిట్టుబాటు వరకు వచ్చింది. హిట్ సినిమా అలా అలా ఇచ్చిన రేట్ల మేరకు పాసయినట్లే. ఇక ఇవి తప్ప, ఆ తరువాత వచ్చిన సినిమాలకు కలెక్షన్లు లేవు.
పలాస సినిమాకు మంచి అప్లాజ్ వచ్చినా, ఉత్తరాంధ్ర పట్టుమని పాతిక లక్షలు దాటుతుందా అని అనుమానాలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీలు రాకుంటే సినిమాలకు కష్టం. ఇప్పుడు ఇంటర్ పరిక్షలు జరుగుతున్నాయి. అందువల్ల థియేటర్లకు జనం దూరంగా వున్నారు.
ఇలాంటి టైమ్ లో కరోనా వైరస్ వచ్చి పడింది. సరే, 25న ఉగాది, అప్పటికి పరిక్షలు అన్నీ అయిపోతాయి అనుకున్నారు. సినిమాలు వరుసగా ప్లాన్ చేసారు. 25న, 2న, ఇలా ప్రతివారం మంచి సినిమాలు వున్నాయి. కానీ ఆంధ్రలో స్థానిక ఎన్నికలు వచ్చి పడ్డాయి. జనాల దగ్గరకు డబ్బులు వస్తాయి కానీ, ప్రచారాలకు వెళ్లడం, మందు, రోజువారీ డబ్బులు తెచ్చుకోవడంలో బిజీగా వుంటారు. ఉగాది మర్నాడు కూడా ఎన్నికలు వున్నాయి.
దీంతో పాటు పదవ తరగతి పరిక్షలు వాయిదా వేసేసారు. అవి నెలాఖరు నుంచి వచ్చే నెల 15 వరకు వున్నాయి. అంటే ఫ్యామిలీలు వచ్చే నెల 15 వరకు థియేటర్ల జోలికి రావు. పైగా టెన్త్, ఇంటర్ కాకుండా మామూలు తరగతుల పరిక్షలు కూడా ఇంకా నెలాఖరులోనే వున్నాయి.
దీంతో 2న విడుదల కావాల్సిన అరణ్య సినిమా వాయిదా అనే వార్త ముందుగా వినిపించడం ప్రారంభమైంది. ఎందుకంటే అది బాలీవుడ్, తమిళంలో కూడా విడుదల కావాల్సి వుంది. అక్కడ కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే వుంది. అందుకని ఆ దిశగా డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆ సినిమా ఏప్రియల్ 24కు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తోంది.
అదే డేట్ కు వస్తున్న అనుష్క నిశ్శబ్దం యూనిట్ మాత్రం రావడం పక్కా అంటూ పోస్టర్ వదిలారు. అదే రోజు మైత్రీ సంస్థ నిర్మించిన ఉప్పెన సినిమా కూడా వుంది. మరి ఇవన్నీ ఏం చేస్తారో? ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.