ఈ కాలంలో కూడా నలుగురు పిల్లలను పెంచడం, పోషించడం సంగతెలా ఉన్నా.. అంత మంది పిల్లలను కనాలనే ఆలోచన కూడా చాలా మందికి ఉండదు! ఒకరూ లేదా ఇద్దరు.. అనే పాలసీని కూడా జనాలు పక్కన పెట్టారు. ఒకరే చాలు.. వారిని బాగా చూసుకుంటే చాలనే దగ్గరకు వచ్చారు భారతీయులు. వందల కోట్ల రూపాయల ఆస్తులున్న వారు కూడా… ఇద్దరికి మించి పిల్లల గురించి ఆలోచించే పరిస్థితి లేదు! దానికి అనేక కారణాలు.
ఆ కారాణాలన్నింటినీ పక్కన పెట్టి నలుగురు పిల్లలను కన్నారు మంచు విష్ణు, ఆయన భార్య విరోనికా. ప్రేమ పెళ్లి చేసుకున్న వీళ్లు తమ ప్రేమకు గుర్తుగా సంతానాన్ని వృద్ధి చేస్తూ ఉన్నారు! ఈ రోజుల్లో చాలా మంది ఆశ్చర్యపోయే రీతిలో నలుగురు పిల్లలను కలిగి ఉండటం వీరి ప్రత్యేకత. బహుశా.. ఊర్లకు ఊర్లు వెదికినా ఇప్పుడు నలుగురు సంతనాన్ని కలిగిన యువ జంటలేవీ కనిపించవేమో! గంపెడు సంతానాన్ని కలిగి ఉండటమూ ఇప్పుడు ప్రత్యేకత. ఈ విషయంలోనే తనను అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారని అన్నాడు మంచు విష్ణు.
ఇండస్ట్రీలో పెళ్లైనా కొంతమంది ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నట్టుగా లేరు. అలాంటి వాళ్ల తల్లిదండ్రులు విష్ణు పేరును ప్రస్తావిస్తూ ఉన్నారట. విష్ణు ను చూడండంటూ.. క్లాసులు పీకుతున్నారట. ఈ విషయాన్ని సదరు సెలబ్రిటీలు తనతో చెప్పి తనకు ఎదురు క్లాస్ వేస్తున్నారంటూ విష్ణు చెప్పాడు. ఇక కళాబంధు సుబ్బరామిరెడ్డి అయితే.. 'ఏమయ్యా నీకు వేరే పనే లేదా..' అని అన్నాడట. విరోనికాకు కజిన్స్ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల 'మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టడం ఆపు..' అన్నారని విష్ణు చెప్పాడు. మొత్తానికి విష్ణు ఫ్యామిలీ కాలానికి భిన్నంగా ఆకర్షిస్తున్నట్టుగా ఉంది అందరినీ!