సినిమా స్ట్రాటజీ అదిరిందిగా!

సినిమాలు హిట్ కావడం వేరు. హిట్ అనిపించడం వేరు. హిట్ అనుకోవడం వేరు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రొడెక్ట్ మార్కెటింగ్ విధానాలు మారినట్లుగానే సినిమా ప్రమోషన్ విధానాలు కూడా మారిపోతున్నాయి. ఆ మధ్య…

సినిమాలు హిట్ కావడం వేరు. హిట్ అనిపించడం వేరు. హిట్ అనుకోవడం వేరు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రొడెక్ట్ మార్కెటింగ్ విధానాలు మారినట్లుగానే సినిమా ప్రమోషన్ విధానాలు కూడా మారిపోతున్నాయి. ఆ మధ్య ఓ సినిమాకు తామే టికెట్ లు కొని తొలిరోజుల్లో పంచుతూ, అదే సమయంలో సినిమా అధ్భుతం అని సోషల్ మీడియాను అల్లాడించేసారు. దాంతో ఓ మాస్ హిస్టీరియా అలుముకుంది. 

అలాగే  కాసిన్ని టికెట్ లు మిగిలినా డిసిఆర్ ఫుల్ రాయడం అనేది కూడా విడుదల అయిన తొలి రోజుల్లో అలవాటు అయింది. అలాగే కలెక్షన్లు దాచేసి, వేరే లెక్కలు విడుదల చేయడం అన్నది హీరో కోసం బయ్యర్లకు అలవాటు చేసారు. ఇలాంటి స్ట్రాటజీలు ఎన్నో వున్నాయి. 

సంక్రాంతికి విడుదల కాబోతున్న ఓ సినిమాను హిట్ చేయడానికి ఓ కొత్త మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని  ప్రతి ప్రధాన పట్టణాల్లో తొలి రోజు మార్నింగ్ షో టికెట్ లు చాలా వరకు ఉచితంగా అందచేయడం అన్నది ఆ ప్లాన్. అలా అని ఎవరికి పడితే వారికి ఇవ్వరు.

హీరోల ఫ్యాన్స్ ల వారీగా యాభై టికెట్ ల వంతున అందిస్తారు. అంటే అందరు హీరోల ఫ్యాన్స్ ను ఆవిధంగా సినిమాకు రప్పిస్తారు అన్నమాట. ఎలాగూ  కాస్త యూత్ ఫిలిం కాబట్టి, పండగ రోజు ఫ్రీగా సినిమా వస్తోంది కాబట్టి కుర్రాళ్లు చూస్తారు. మంచి ఓపెనింగ్స్ నమోదు అయినట్లు లెక్కలు చెబుతాయి. ఇక ఆపైన సినిమా ఏమాత్రం బాగున్నా, సూపర్..సూపర్..సూపర్..అని టముకేయడానికి డిజిటల్ మీడియా టీమ్ లు రెడీగా వుండనే వుంటాయి.

తప్పదు. సినిమా కూడా ప్రొడెక్ట్ నే కదా..మార్కెటింగ్ చేసుకోవాల్సిందే.