ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. అది కూడా జనసేనాని పవన్‌తో కావడం విశేషం. జనసేనతో చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతుంటే…తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసేనాని పవన్‌కల్యాణ్ అదే గేమ్ ఆడుతుండడం విశేషం. అయితే నాయకుడిపై ప్రేమ వల్ల కావచ్చు, మరే ఇతర కారణాలో తెలియదు కానీ, పవన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిసినా, పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల కుప్పం పర్యటనలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో వన్‌సైడ్ లవ్ నడుస్తోందని, అటువైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోతే తానేం చేయాలని బహిరంగంగానే చంద్రబాబు ప్రశ్నించారు. బాబు పొత్తు ప్రస్తావనపై ఆలస్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ స్పందించారు.
‘మనం ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాం. రకరకాల పార్టీల వారు మన పొత్తు కోరుకోవచ్చు. అది వారి మైండ్‌గేమ్ కావొచ్చు లేదంటే వేరొకటి కావొచ్చు. వారు ఆడే మైండ్‌గేమ్‌లో పార్టీ నేతలెవరూ పావులు కాకండి. ఇది దృష్టిలో పెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు పూర్తిగా సంస్థాగత నిర్మాణంపైనే దృష్టిపెడదాం’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. అంతే తప్ప, జనసేనకు చెందిన అధికార ప్రతినిధులు, శ్రేణులు నిర్ద్వందంగా టీడీపీతో పొత్తు వ్యతిరేకిస్తున్నట్టు జనసేనాని మాట్లాడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తాత్కాలికంగా పొత్తు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అందరం కలిసి చర్చించి, తగిన నిర్ణయం తీసుకుందామని ఊరడింపు మాటలు చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబుపై ఇంకా పవన్‌కల్యాణ్ ప్రేమ చంపుకోలేదని చెప్పేందుకు ఈ దాటవేత ధోరణే నిదర్శనమని పలువురు అంటున్నారు.
నిజంగా బీజేపీతో కొనసాగాలనే ఉద్దేశమే పవన్‌లో ఉంటే…ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటే… భవిష్యత్ గురించి చెప్పలేమనే సంకేతాలు వెలువడుతున్నాయని అనేవాళ్లు లేకపోలేదు. పవన్‌కల్యాణ్ మనస్తత్వం తెలిసిన వారెవరైనా అతను స్థిరంగా ఒక పార్టీతోనే కొనసాగుతారని నమ్మడం లేదు. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా వుంటాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.